టీ20 ప్రపంచకప్ 2026 నుంచి దక్షిణాఫ్రికా నిష్క్రమించింది. బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో ఆ జట్టు పరాజయం పాలైంది. దీంతో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా సెమీఫైనల్ చేరిన సౌతాఫ్రికా.. సెమీస్‌లో ఓడిపోయి.. ట్రోఫీకి దూరమైంది. ఐసీసీ వరల్డ్ కప్ గెలవాలన్న కలను మరోసారి నెరవేర్చుకోకుండానే.. వెనుదిరిగింది. బుధవారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. అనంతరం న్యూజిలాండ్.. 12.5 ఓవర్లలో 1 వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో టీ20 ప్రపంచకప్ 2026లో ఫైనల్ చేరిన తొలి జట్టుగా అవతరించింది. ఫిన్ అలెన్ 33 బంతుల్లో సెంచరీతో అజేయంగా నిలిచాడు.ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా తక్కువ స్కోరుకే పరిమితమైంది. న్యూజిలాండ్ బౌలర్ల దెబ్బకు.. ఆ జట్టు బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో ఓ దశలో 77 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. కానీ చివర్లో మార్కో జాన్సెన్ 30 బంతుల్లో అజేయంగా 55 రన్స్ చేసి.. జట్టుకు పోరాడే స్కోరు అందించాడు. దీంతో.. సౌతాఫ్రికా.. కివీస్‌కు 170 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది.అనంతరం ఛేజింగ్ ప్రారంభించిన కివీస్.. ఏ దశలోనూ తడబడలేదు. ఆ జట్టు ఓపెనర్లు ఎడాపెడా ఫోర్లు సిక్సర్లతో విరుచుకబడ్డారు. సెమీఫైనల్ టెన్షన్ ఏమో కానీ.. ఎప్పుడెప్పుడు మ్యాచ్ ముగిద్దామా అన్నట్లు ప్రొటీస్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఫిన్ అలెన్, టిమ్ సెఫర్ట్ విధ్వంసానికి కివీస్.. పవర్‌ ప్లే ముగిసే సరికి 84/0తో తిరుగులేని స్థితిలో నిలిచింది. పవర్ ప్లే ముగిసేలోపే విజయాన్ని ఖరారు చేసుకుంది. 33 బంతుల్లో 58 రన్స్ చేసిన తర్వాత టిమ్ సెఫర్ట్ ఔట్ అయినా.. మరో ఓపెనర్ ఫిన్ అలెన్ మాత్రం అస్సలు తగ్గలేదు. దీంతో టీ20 ప్రపంచకప్ 2026లో మొదటి సెమీఫైనల్ ఏకపక్షంగా మారిపోయింది. చివరకు 12.5 ఓవర్లలో న్యూజిలాండ్ విజయం సాధించింది. 9 వికెట్ల తేడాతో విక్టరీ నమోదు చేసింది. ఫిన్ అలెన్ 33 బంతుల్లో సెంచరీ కొట్టి.. అజేయంగా నిలిచాడు.ఈ విజయంతో టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్‌కు న్యూజిలాండ్ అడుగుపెట్టింది. గురువారం భారత్, ఇంగ్లాండ్ మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో మార్చి 8న న్యూజిలాండ్ టైటిల్ పోరులో తలపడనుంది.