విజయవాడలోని మధురానగర్‌లో చోటుచేసుకున్న ఓ అనుమానాస్పద మృతి కేసు.. స్థానికంగా కలకలం రేపుతోంది. మధురానగర్ కొబ్బరితోట ప్రాంతానికి చెందిన చంద్రశేఖర్ అనే 30 ఏళ్ల వ్యక్తి ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. అలాగే 29 వ డివిజన్ తెలుగు యువత కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ.. సోమవారం రాత్రి చంద్రశేఖర్ పోలీస్ కమిషనర్ కార్యాలయం వద్దకు వెళ్లారు. తననుఅంతా మోసం చేశారని.. బతకాలని లేదని, ఆత్మహత్య చేసుకుంటానంటూ హడావిడి చేశారు. దీంతో పోలీస్ కమిషనర్ కార్యాలయం భద్రతా సిబ్బంది.. అతన్ని అదుపులోకి తీసుకుని సూర్యారావుపేట పోలీసులకు సమాచారం అందించారు.సూర్యారావుపేట పోలీసుల వద్ద కూడా చంద్రశేఖర్‌ది అదే మాట. తనను అంతా మోసం చేశారని.. బతకాలని లేదంటూ చెప్పారు. మోసం చేసిన వారి గురించి పోలీసులు ప్రశ్నిస్తే ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. దీంతో సూర్యారావుపేట పోలీసులు చంద్రశేఖర్‌కు సోమవారం రాత్రి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆత్మహత్య చేసుకోవద్దంటూ నచ్చజెప్పి.. ఆ తర్వాత అతని బంధువుకు అప్పగించారు. అయితే చంద్రశేఖర్ సోమవారం రాత్రి ఇంటికి చేరలేదు. మంగళవారం ఉదయం చంద్రశేఖర్ మృతదేహం రైల్వేగేటు వద్ద రైలుపట్టాల మీద కనిపించింది. మధురానగర్ రైల్వే లైనుపై అతని మృతదేహాన్ని స్థానికులు మంగళవారం ఉదయం గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు చంద్రశేఖర్‌ది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అయితే ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.మరోవైపు చంద్రశేఖర్ ఆత్మహత్య చేసుకుంటానని వాట్సప్ స్టేటస్ పెట్టినట్లు అతని స్నేహితులు చెప్తున్నారు. అయితే కొద్దిసేపటికే ఆ వీడియో డిలీట్ అయ్యిందని చెప్తున్నారు. మరోవైపు రైలు పట్టాలు దాటే సమయంలో రైలు ఢీకొట్టి చనిపోయాడని చంద్రశేఖర్ బంధువులు చెప్తున్నారు. సూర్యారావుపేట పోలీసుల వద్ద నుంచి బయల్దేరిన తర్వాత.. మధురానగర్ రైల్వేలైన్ వద్ద బంధువు వదిలి వెళ్లాడని.. రైలు పట్టాలు దాటే సమయంలో ప్రమాద జరిగి చంద్రశేఖర్ చనిపోయినట్లు బంధువులు చెప్తున్నారు. పోలీసుల అనుమానాస్పద మృతి కింద కేసు నమోదుచేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.