టెస్లాతో యాక్సిస్ బ్యాంక్ జట్టు.. 10 ఏళ్ల వ్యవధితో లోన్స్.. భారత్‌లో ఈవీ ఫైనాన్సింగ్‌కు ఊతం

Wait 5 sec.

: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన దిగ్గజ ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ టెస్లా దేశీయంగా విక్రయాలు పెంచేందుకు పలు ఆఫర్లను ఇటీవలే ప్రకటించింది. ఇప్పుడు దేశంలోని దిగ్గజ ప్రైవేట్ బ్యాంకుల్లో ఒకటైన యాక్సిస్ బ్యాంకుతో జట్టు కట్టింది. టెస్లా కార్లకు ఫైనాన్షింగ్ ఇబ్బందులు లేకుండా చూసేందుకు ఈ ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. యాక్సిస్ బ్యాంకుతో ఒప్పందంతో కొనుగోలుదారులకు మద్దతుగా నిలిచి సేల్స్ పెంచుకోవాలని చూస్తోంది. గత ఏడాది భారత్‌లో లాంచే చేసిన టెస్లా మోడల్ వై కారు సేల్స్ పెంచుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఈ ఎలక్ట్రిక్ వాహనాల సంస్థ టెస్లాకు ప్రాధాన్య ఫైనాన్సర్‌గా నిలిచే దిశాగ భాగస్వామ్యం కుదిరినట్లు యాక్సిస్ బ్యాంక్ బుధవారం వెల్లడించింది. ఈ భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా టెస్లా కస్టమర్లకు ఎలక్ట్రిక్ వాహనాలు (EV) రుణ సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని తెలిపింది. ఈ ఒప్పందం ప్రకారం ప్రముఖ నగరాలు, వర్ధమాన ఈవీ హబ్‌లలో డిజిటల్ ఆధారిత ఫైనాన్సింగ్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయని బ్యాంక్ తెలిపింది. ప్రీమియం ఈవీ కొనుగోలుదారుల కోసం నగదు ఇబ్బందులు లేకుండా చేయడమే కాకుండా అనుగుణ రీపేమెంట్ పథకాలు సైతం అందిస్తున్నట్లు పేర్కొంది. ఈవీ రుణాలను గరిష్ఠంగా 10 ఏళ్ల రుణ వ్యవధితో, పూర్తిగా డిజిటల్ ఆన్ బోర్డింగ్ వంటి సౌకర్యాల ద్వారా అందిస్తున్నట్లు పేర్కొంది. భారత్‌లో ఎలక్ట్రిక్ మొబిలిటీ విస్తరణకు ఈ టెస్లా- యాక్సిస్ బ్యాంక్ ఒప్పందం దోహదపడుతుందని, కస్టమర్లకు సౌకర్యవంతమైన, అనువైన ఫైనాన్సింగ్ పరిష్కారాలు అందించడమే లక్ష్యమని యాక్సిస్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మునీశ్ శర్దా తెలిపారు. భారత్‌లో ఎలక్ట్రిక్ మొబిలిటీ విస్తరణకు టెస్లాతో చేతులు కలపడం గర్వకారణంగా ఉందన్నారు. 'ఈ సహకారం ద్వారా, మేము వినూత్నమైన, అనుకూలమైన ఫైనాన్సింగ్ పరిష్కారాలతో పాటు, కస్టమర్‌కు ప్రపంచ స్థాయి ఎలక్ట్రిక్ వాహనాలను ఒకచోట చేర్చుతున్నాము. ఇది కస్టమర్లు సౌలభ్యం మెరుగుపరుస్తుంది. ఈ చర్య బాధ్యతాయుతమైన బ్యాంకింగ్, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న పరిష్కారాలపై మా నిరంతర దృష్టిని ప్రతిబింబిస్తుంది.' అని ఆయన అన్నారు. టెస్లా మోడల్ వై ఆఫర్ ప్రత్యేక ఆఫర్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. పెట్రోల్, డీజిల్ కార్ల యజమానులు ఈవీకి మారాలనుకుంటే ఎక్స్ఛేజ్ ఆఫర్ తో రూ.3 లక్షల వరకు ప్రోత్సాహకాలు ఇస్తామని తెలిపింది. లేదా కేవలం రూ.6 లక్షల డౌన్ పేమెంట్ చెల్లించి టెస్లా కారును ఇంటికి తీసుకెళ్లవచ్చని తెలిపింది. వీరు నెలకు రూ.49 వేల ఈఎంఐ చెల్లిస్తే సరిపోతుందని, ప్రీమియం ఎలక్ట్రిక్ కారును సొంతం చేసుకోవచ్చని పేర్కొంది.