తమ భూభాగంపైకి క్లస్టర్ బాంబు బాలిస్టిక్ క్షిపణులను ఇరాన్ ప్రయోగించిందని ఇజ్రాయెల్ సైనిక అధికారులు తెలిపారు. ప్రస్తుతం యుద్ధంలో ఇటువంటి వివాదాస్పద అత్యాధునిక బాంబులను వినియోగించడం ఇదే మొదటిసారి. ఆధునిక ఆయుధాల్లో అత్యంత వివాదాస్పదమైన వాటిలో క్లస్టర్ క్షిపణులు ఒకటి. డజన్ల కొద్దీ పేలుడు పదార్థాలను విస్తారమైన ప్రాంతంలో ఒకేసారి వెదజల్లగలిగే సామర్థ్యం వీటి సొంతం. ఇరాన్‌కు చెందిన క్లస్టర్ క్షిపణి వార్‌హెడ్‌లు.. గాల్లోనే 80 వరకు సబ్‌మ్యూనిషన్‌లను విడుదల చేయగలవని, అనేక కిలోమీటర్ల దూరంలో విధ్వంసకర శకలాలను వ్యాపింపజేయగలవని ఇజ్రాయెల్ రక్షణ అధికారులు చెబుతున్నారు. వాస్తవంగా ఈ తరహా క్షిపణులపై నిషేధం ఉన్నా.. ఇరాన్ ఎలా వీటిని పొందిందనేది చర్చనీయాంశంగా మారింది.నిపుణుల హెచ్చరికఈ ఆయుధాల వినియోగంతో యుద్ధ స్వరూపమే మారిపోతుందని సైనిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకేచోట భారీ పేలుడు సంభవించకుండా.. అనేక ప్రాంతాల్లో చిన్న చిన్న బాంబులను చెల్లాచెదురుగా వార్‌హెడ్‌లు వెదజల్లుతాయి. దీంతో పౌరుల ప్రాణాలకు ముప్పు గణనీయంగా పెరుగుతుంది. అంతేకాదు, పేలకుండా మిగిలిపోయిన బాంబులతో యుద్ధం ముగిసిన తర్వాత కూడా దీర్ఘకాలం ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది తక్షణ సైనిక ముప్పు మాత్రమే కాదు.. ఈ బాంబులను తయారుచేసే సామర్థ్యాన్ని ఇరాక్‌ ఎలా అభివృద్ధి చేసుకుందనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అత్యాధునిక అయుధ తయారీ కోసం పరిశోధనలు సాగించే శాస్త్రవేత్తలు తరుచూ లక్ష్యంగా మారిన ఆ దేశంలో ఇంతటి అధునాతన సాంకేతికత ఎలా వచ్చిందనేది ఆసక్తికరంగా మారింది. అయితే, ఈ బాంబులు తయారీకి బయట నుంచి సహకారం ముఖ్యంగా చైనా, రష్యాల నుంచి సాంకేతి పరిజ్ఞానం బదిలీ జరిగినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇజ్రాయెల్‌పై దాడులుతాజా దాడుల్లో కనీసం ఓ ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి క్లస్టర్ బాంబులను మోసుకొచ్చిందని, అది సెంట్రల్ ఇజ్రాయెల్‌లో కూలిందని ఆ దేశ సైనికాధికారులు తెలిపారు. ఇజ్రాయెల్ నివేదికల ప్రకారం.. క్షిపణి వార్‌హెడ్ భూమి నుంచి దాదాపు నాలుగు మైళ్ల ఎత్తులో లేదా దాదాపు ఏడు కిలోమీటర్ల ఎత్తులో విడిపోయింది. ఆ తర్వాత అది దాదాపు 20 సబ్‌మ్యూనిషన్‌లను విడుదల చేసి, మధ్య ఇజ్రాయెల్ మీదుగా దాదాపు ఐదు మైళ్ల వ్యాసార్థంలో వాటిని జారవిడిచింది. గత నెల 28 నుంచి జరుగుతోన్న యుద్ధంలో ఇప్పటి వరకూ ఇజ్రాయెల్‌‌లో 11 మంది ప్రాణాలు కోల్పోయారని, 1000 మందికిపైగా గాయపడ్డారు.తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్నప్పటికీ, క్లస్టర్ వార్‌హెడ్‌ల వినియోగం కొత్త సవాల్‌ విసురుతుందని ఇజ్రాయెల్ రక్షణ అధికారులు పేర్కొన్నారు. ఈ ఆయుధాలు పట్టణ ప్రాంతాలలో డజన్ల కొద్దీ బాంబులను వెదజల్లి, మరింత క్లిష్టతరం చేస్తాయని, ద్వితీయ ప్రమాదాలను పెంచుతాయని తెలిపారు. గత శనివారం నుంచి ఇరాన్ ఇజ్రాయెల్‌పై కనీసం ఐదు క్లస్టర్ క్షిపణులను ప్రయోగించిందని, అన్నీ జనసాంద్రత కలిగిన పౌర ప్రాంతాలే లక్ష్యంగా ఉన్నాయని రక్షణ అధికారులు భావిస్తున్నారు.మంగళవారం మధ్య ఇజ్రాయెల్ వైపు జరిగిన దాడిలో అలాంటి రెండు క్షిపణులను ప్రయోగించారు. ఈ దాడులు అనేక ప్రదేశాలలో ఆస్తి నష్టం, గాయాలకు కారణమయ్యాయి.గతేడాది జూన్‌లో 12 రోజుల పాటు జరిగిన యుద్ధ సమయంలో ఇరాన్ మొదటిసారిగా వీటిని మోహరించినట్టు ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. ప్రస్తుత యుద్ధంలోనూ వాటిని మళ్లీ వాడుతోందని పేర్కొన్నారు. వీటిలో స్వల్పశ్రేణి జోల్ఫాఘర్, దీర్ఘశ్రేణి ఖద్ర్ సిరీస్, ఖోర్రామ్‌షహర్ బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయని చెప్పారు. ఈ మూడు వ్యవస్థలలో ఖోర్రామ్‌షహర్ అత్యంత శక్తివంతమైందిగా పరిగణిస్తారు. దాదాపు 2,000 కిలోమీటర్ల పరిధిని కలిగిన ఈ క్షిపణి, 80 క్లస్టర్ బాంబులను మోయగలదని ఇరాన్ పేర్కొంది.