టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా జరుగుతున్న రెండో సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్ కెప్టెన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఇక ఈ మ్యాచ్ కోసం ఇంగ్లాండ్ తమ తుది జట్టులో ఒక మార్పు చేసింది. రెహాన్ అహ్మద్ ప్లేసులో జెమీ ఓవర్టన్‌ను తుది జట్టులోకి తీసుకుంది. మరోవైపు ఎలాంటి మార్పుల్లేకుండానే.. వెస్టిండీస్‌తో తలపడ్డ ప్లేయింగ్ లెవెన్‌తో భారత్ బరిలోకి దిగుతోంది.ముంబైలోని వాంఖడే క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్.. తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. పిచ్ కండీషన్ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు. బంతితో తాము మంచి ఆరంభాన్ని అందుకుంటామని ఆశిస్తున్నట్లు బ్రూక్ వ్యాఖ్యానించాడు. ఇదే సమయంలో ఈ స్టేడియంలో భారత అభిమానులను సైలెంట్‌గా ఉంచుతామని అనుకుంటున్నట్లు ఇంగ్లాండ్ కెప్టెన్ అన్నాడు.మరోవైపు తాము టాస్ గెలిచినా.. తొలుత బ్యాటింగ్ ఎంచుకునే వాళ్లమని టీమిండియా కెప్టెన్ చెప్పాడు. టాస్ ఓడిపోయిన తర్వాత అతడు మాట్లాడాడు. పిచ్‌ను చూస్తే.. పెద్దగా మంచు ప్రభావం ఉండే అవకాశం లేనట్లు కనిపిస్తోందని పేర్కొన్నాడు. ఇక ఈ మ్యాచ్‌ కోసం టీమిండియా తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. తుది జట్లు ఇవే..భారత్‌: అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్‌), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబె, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రాఇంగ్లాండ్‌: ఫిలిప్ సాల్ట్‌, జోస్ బట్లర్ (వికెట్ కీపర్‌), హ్యారీ బ్రూక్ (కెప్టెన్‌), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కర్రన్, విల్ జాక్స్, జెమీ ఓవర్టన్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్ఇక టీ20 ప్రపంచకప్ 2026లో న్యూజిలాండ్ ఇప్పటికే ఫైనల్ చేరింది. సెమీఫైనల్‌లో సౌతాఫ్రికాపై విక్టరీ నమోదు చేసింది. ఇవాళ్టి మ్యాచ్‌లో గెలిచిన జట్టు కూడా ఫైనల్ చేరుతుంది. మార్చి 8న తుది పోరు జరగనుంది.