ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణ పనులలో వేగం పెరిగింది. సోమవారం రోజున అమరావతిలోని హెచ్ఓడీ టవర్ల నిర్మాణంలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. హెచ్ఓడీ టవర్ల నిర్మాణంలో భాగంగా టవర్ -1కు మొదటి స్టీల్ డయాగ్రిడ్ అమర్చే పనులు ప్రారంభమయ్యాయి. ఏపీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ చేతుల మీదుగా ఈ పనులు ప్రారంభమయ్యాయి. అనంతరం విలేకర్లతో మాట్లాడిన .. అమరావతి రైతులకు చెప్పిన మాట ప్రకారమే రాజధాని నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. అమరావతి జీఏడీ, హెచ్‌ఓడీ టవర్ల నిర్మాణంలో భాగంగా డయాగ్రిడ్ టెక్నాలజీతో మొత్తం ఐదు టవర్లు నిర్మిస్తున్నట్లు నారాయణ వెల్లడించారు.47 అంతస్తులలో జీఏడీ టవర్ నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి నారాయణ వివరించారు. మిగతా టవర్లను 40 అంతస్తులతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. 53 లక్షల చదరపు అడుగుల బిల్డ్ ఏరియాతో టవర్ల నిర్మాణం చేపట్టనున్నట్లు వివరించారు. అన్ని కార్యాలయాలు, అధికార యంత్రాంగం మొత్తం ఒకేచోట ఉండేలా ఈ టవర్లను డిజైన్ చేసినట్లు తెలిపారు. 2028 అక్టోబర్ నాటికి జీఏడీ, హెచ్ఓడీ టవర్ల నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. మరోవైపు మూడు ప్యాకేజీల కింద అమరావతిలో టవర్ల నిర్మాణం చేపడుతున్నారు. రూ.4,688.82 కోట్ల అంచనా వ్యయంతో వీటి నిర్మాణం చేపట్టారు. మొదటి ప్యాకేజీ కింద రూ.1,126.51 కోట్లతో జీఏడీ టవర్‌ నిర్మిస్తున్నారు. రెండో ప్యాకేజీ పనుల కింద 1,897.86 కోట్ల రూపాయలతో 1, 2 టవర్లు నిర్మించనున్నారు. మూడో ప్యాకేజీ పనుల కింద రూ.1,664.45 కోట్లతో మూడు, నాలుగో టవర్లు నిర్మించనున్నారు. ఈ ఐకానిక్ టవర్ల నిర్మాణం డయాగ్రిడ్ విధానంలో చేపట్టనున్నారు. టవర్లలో జీఏడీ టవర్ అన్నింటికంటే ఎత్తు ఉండనుంది. బేస్‌మెంట్, గ్రౌండ్‌ ఫ్లోర్‌ కాకుండా జీఏడీ టవర్‌‌ను 47 అంతస్తులుగా నిర్మించనున్నారు. ఇందులోనే సీఎం ఆఫీస్ ఉంటుంది. జీఏడీ టవర్ టెర్రస్‌పై హెలిప్యాడ్‌ నిర్మించనున్నారు. మిగతా నాలుగు హెచ్ఓడీ టవర్లను 40 అంతస్తుల చొప్పున నిర్మించనున్నారు. ఇక ఈ డిజైన్ 60 వేల టన్నుల స్టీల్ అవసరమవుతుందని అంచనా.