ఒకవైపు.. కల్తీ రాయుళ్లు రోజురోజుకూ తీవ్రంగా రెచ్చిపోతున్నారు. కనిపించిన ప్రతీ ఆహార పదార్థాన్ని కల్తీ చేస్తూ.. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఈ సమయంలోనే కుళ్లిపోయిన ఆహార పదార్థాలను కూడా ప్రజలకు అందిస్తూ వారి పాలిట యమదూతలుగా మారుతున్నారు. ఈ క్రమంలోనే హోటళ్లు, రెస్టారెంట్లలో చికెన్, మటన్ వంటి మాంసాలను రోజుల తరబడి నిల్వ ఉంచుతూ.. అవి కుళ్లిపోయిన తర్వాత వంట చేస్తున్నారు. ఇలాంటి ముఠానే ఇప్పుడు హైదరాబాద్‌లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) అధికారుల తనిఖీల్లో దొరికిపోయింది. ముషీరాబాద్ పార్శిగుట్టలో బాపూజీనగర్‌లోని ఏ 1 ఫ్రెష్ చికెన్ మార్ట్‌పై వారాసిగూడ పోలీసులతో కలిసి జీహెచ్ఎంసీ అధికారులు దాడి చేశారు. ఈ తనిఖీల్లో 800 కిలోల కుళ్లిపోయిన చికెన్ మాంసాన్ని నిల్వ చేసినట్లు గుర్తించారు. ఆ షాపు ఓనర్ షేక్ షకీల్ పాడైపోయిన చికెన్‌ను అమ్ముతున్నట్లు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడ తనిఖీలు చేపట్టి దాన్ని సీజ్ చేశారు. ఇలా భారీ ఎత్తున నిల్వ చేసిన చికెన్‌ను.. హైదరాబాద్‌లో ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లు, బార్‌లకు సరఫరా చేస్తున్నట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. అయితే స్వాధీనం చేసుకున్న చికెన్ మాంసం దుర్వాసన రావడంతోపాటు.. అత్యంత అపరిశుభ్ర ప్రాంతంలో దాన్ని నిల్వ చేసినట్లు పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించారు. అక్కడ ఎలుకలు, పిల్లులు పరిగెడుతున్నాయని పేర్కొన్నారు. మరోవైపు.. ఏ 1 ఫ్రెష్ చికెన్ షాపు ట్రేడింగ్ లైసెన్స్ గడువు ముగిసిందని.. విచారణలో అధికారులు గుర్తించారు. అయితే లైసెన్స్ గడువు ముగిసి సంవత్సరం దాటిపోయినా రెన్యువల్‌ చేయించుకోలేదని.. అయినా అక్రమంగా కొనసాగిస్తున్నట్లు తేలింది. ఈ నేపథ్యంలోనే నిందితుడైన ఆ షాప్ యజమాని షేక్ షకీల్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మరింత లోతైన దర్యాప్తు చేపట్టారు.ఒకవైపు.. ప్రస్తుత వేసవి కాలంలో రోజురోజుకూ ఆకాశాన్ని అంటుతుంటే.. ఇలాంటి వాళ్లు కుళ్లిపోయిన మాంసంతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇలా కుళ్లిన చికెన్‌ను నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లకు సప్లై చేస్తున్నారనే విషయం తెలిసిన నగరవాసులు ఇప్పుడు భయం భయంగా బతుకుతున్నారు.