శుభవార్త చెప్పిన ఎస్బీఐ.. 'పెద్ద' డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంపు.. కొత్త రేట్లు ఇవే..

Wait 5 sec.

Bank FD: ఆర్బీఐ కొంత కాలంగా కీలక రెపో రేట్లను తగ్గిస్తూ వస్తున్న వేళ.. బ్యాంకులు కూడా వెంటనే లోన్ వడ్డీ రేట్లు తగ్గించి.. ఇదే సమయంలో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను కూడా తగ్గిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఇవి ఆకర్షణ కోల్పోయాయి. . అయినప్పటికీ ఈ సమయంలో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్.. ఎస్బీఐ శుభవార్త చెప్పింది. ఇది ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచేసింది. అన్ని డిపాజిట్లపై ఇది వర్తించదు. రూ. 3 కోట్లకుపైగా విలువైన డిపాజిట్లపైనే ఇది వర్తిస్తుంది. దీనినే బల్క్ ఫిక్స్‌డ్ డిపాజిట్ అని చెబుతారు. రూ. 3 కోట్ల కంటే తక్కువ విలువైన డిపాజిట్లను రిటైల్ ఫిక్స్‌డ్ డిపాజిట్లుగా పేర్కొంటారు. ఈ చిన్న డిపాజిట్ వడ్డీ రేట్లు మార్చలేదు. అన్ని టెన్యూర్లపై కాకుండా.. కొన్ని ఎంపిక చేసిన టెన్యూర్లపైనే బల్క్ ఎఫ్‌డీ రేట్లు పెంచింది ఎస్బీఐ. ఇక్కడ గరిష్ఠంగా 25 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ రేట్లు పెరిగాయి. పెరిగిన వడ్డీ రేట్లు 2026, మార్చి 15 నుంచే అమల్లోకి వస్తుందని బ్యాంక్ స్పష్టం చేసింది. 46-179 రోజుల వ్యవధి ఎఫ్‌డీ వడ్డీ రేట్లు 25 బేసిస్ పాయింట్లు పెరగ్గా గతంలో సాధారణ ప్రజలకు ఇక్కడ 5.6 శాతం వడ్డీ రేటు ఉంటే ఇప్పుడు అది 5.85 శాతానికి పెరిగింది. 180-210 రోజులు, 211 రోజుల నుంచి ఏడాదిలోపు డిపాజిట్లపై 6.10 శాతం నుంచి 25 బేసిస్ పాయింట్లు పెరిగి 6.35 శాతానికి చేరాయి. ఏడాది నుంచి రెండేళ్ల వ్యవధి డిపాజిట్లపై 6.75 శాతం నుంచి వడ్డీ రేటు 7 శాతానికి చేరింది. 2-3 ఏళ్లు, 3-5 ఏళ్లు, 5-10 ఏళ్ల వ్యవధులపై వడ్డీ రేట్లు మారలేదు. ఇవి సాధారణ ప్రజలకు వరుసగా 6.65 శాతం, 6.5 శాతం, 6.50 శాతంగా ఉన్నాయి. రూ. 3 కోట్లకు లోబడిన డిపాజిట్లు అంటే సాధారణ ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు వారం నుంచి గరిష్ఠంగా పదేళ్ల వరకు డిపాజిట్లపై చూస్తే సాధారణ ప్రజలకు కనీసం 3.05 శాతం నుంచి గరిష్ఠంగా 6.40 శాతంగా ఉంది. 2-3 ఏళ్ల వ్యవధి డిపాజిట్‌పై ఇక్కడ వడ్డీ అధికంగా 6.40 శాతంగా ఉంది. సీనియర్ సిటిజెన్లకు 3.55 శాతం నుంచి 7.05 శాతంగా వడ్డీ రేటు ఉంది. వీరికి అధిక వడ్డీ 5-10 ఏళ్ల టెన్యూర్‌కు వర్తిస్తుంది. దీనినే ఎస్బీఐ వీ కేర్ డిపాజిట్‌గా చెబుతారు. ఇదే సమయంలో ఎస్బీఐలో 444 రోజుల వ్యవధితో అమృత్ వృష్టి స్పెషల్ ఎఫ్‌డీ ఉంది. ఇక్కడ సాధారణ ప్రజలకు వడ్డీ రేటు 6.45 శాతంగా ఉండగా.. సీనియర్ సిటిజెన్లకు 6.95 శాతం, సూపర్ సీనియర్ సిటిజెన్లకు 7.05 శాతంగా ఉంది.