తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలను ఇచ్చిన సంగతి తెలిసిందే. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలకు 6 గ్యారెంటీలను అమలు చేస్తామని ప్రకటించింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే ఈ 6 గ్యారెంటీల్లో కొన్నింటిని రేవంత్ రెడ్డి సర్కార్ అమలు చేస్తోంది. మరికొన్ని హామీలు మాత్రం మిగిలిపోయాయి. దీనిపై ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆరు గ్యారెంటీల అమలుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుం బిగించింది. 6 గ్యారెంటీలకు భారీగా నిధులను కేటాయించింది. ఈ పథకాల అమలు కోసం ఏకంగా రూ.50,713 కోట్లను కేటాయిస్తున్నట్లు తెలిపింది. తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క.. ఆరు గ్యారెంటీలకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. ఆరు గ్యారెంటీల్లో భాగంగా రైతు భరోసా పథకానికి రూ.18 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. చేయూత పథకానికి రూ.14,861 కోట్లు.. ఇందిరమ్మ ఇండ్ల పథకానికి రూ.5,500 కోట్లు.. మహాలక్ష్మి పథకానికి రూ.4,305 కోట్లు.. రైతులు పండించిన సన్న వడ్ల బోనస్‌కు రూ.3,500 కోట్లు.. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించే గృహ జ్యోతి పథకానికి రూ.2,080 కోట్లను కేటాయించారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకానికి రూ.1,143 కోట్లు.. మహాలక్ష్మి పథకం కింద ఎల్పీజీ సబ్సిడీకి రూ.723 కోట్లు.. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి రూ. 600 కోట్లు.. పవర్ సబ్సిడీకి రూ.14 వేల కోట్లు.. బియ్యం సబ్సిడీకి రూ.3 వేల కోట్లు.. కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్‌ స్కీంకు రూ.3,683.. విద్యార్థుల డైట్ ఛార్జీల కోసం రూ.2,170 కోట్లు.. విద్యార్థుల స్కాలర్‌షిప్‌లకు రూ.4,343 కోట్లు.. ఆఫీస్ ఖర్చులకు రూ.2,323 కోట్లు కేటాయించారు. మూసీ నది ప్రాజెక్టు కోసం రూ.1500 కోట్లు కేటాయిస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కోసం రూ.5 వేల కోట్లు.. ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం కోసం రూ.1,056 కోట్లు.. ఉస్మానియా యూనివర్సిటీకి రూ. వెయ్యి కోట్ల కేటాయింపులు చేసినట్లు భట్టి వివరించారు.