గొప్ప మనసు చాటుకున్న భార్యాభర్తలు.. సొంత ఊరిలో ప్రభుత్వ ఆస్పత్రికి రూ.5కోట్లు విరాళం

Wait 5 sec.

నెల్లూరు జిల్లాకు చెందిన దంపతులు పెద్ద మనసు చాటుకున్నారు. తమవంతుగా ప్రభుత్వ స్కూల్స్, కాలేజీలకు భారీగా విరాళాలు ఇష్తున్నారు. అలాగే తాజాగా ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణానికి భారీ సాయం చేశారు. నెల్లూరు జిల్లా బోగోలుకు చెందిన బచ్చు కృష్ణకుమార్‌, సంధ్య దంపతులు అమరా బచ్చు ఛారీటబుల్ ట్రస్ట్‌ను నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. తాజాగా అమరా బచ్చు ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా బోగోలులో నిర్మిస్తున్న ప్రభుత్వ ఆస్పత్రికి సాయం అందించారు. బచ్చు కృష్ణకుమార్‌, సంధ్య దంపతులు తమ ట్రస్టు ద్వారా.. పీ4 పథకంలో భాగంగా నెల్లూరు జిల్లా బోగోలు తహసీల్దారు కార్యాలయం పక్కన రూ.5 కోట్లతో నిర్మిస్తున్నప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో బచ్చు దంపతులతో పాటుగా కావలి ఎమ్మెల్యే డీవీ కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర సతీమణి జ్యోతిలు కూడా పాల్గొన్నారు. బోగోలు ప్రాంతానికి అమర బచ్చు ఛారిటబుల్‌ ట్రస్టు వరంగా మారిందన్నారు కావలి ఎమ్మెల్యే డీవీ కృష్ణారెడ్డి. బచ్చు కృష్ణకుమార్‌ దంపతులు అమెరికాలో స్థిరపడినా.. పుట్టిన ఊరిపై మమకారంతో విద్య, వైద్యం, ఆధ్యాత్మిక సేవలకు భారీగా నిధులు కేటాయిస్తున్నారని సత్కరించి, వారిద్దరిని అభినందించారు. బచ్చు కృష్ణకుమార్‌, సంధ్య దంపతులు ద్వారా ప్రభుత్వ స్కూల్స్, కాలేజీల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ముందుకు వచ్చారు. ఇటీల మంత్రి లోకేష్‌ను కలిసి.. బోగోలు మండలంలోని ప్రభుత్వ స్కూల్స్, జూనియర్‌ కాలేజీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.5 కోట్లు సాయం ప్రకటించారు. మంత్రి లోకేష్‌ను త్వరలో చేపట్టనున్న ఆయా అభివృద్ధి పనుల శంకుస్థాపనకు రావాలని ఆహ్వానించారు. అంతేకాదు బచ్చు కృష్ణకుమార్‌, సంధ్య దంపతులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధికి రూ.5 కోట్లు ప్రకటించగా.. కొండబిట్రగుంటలోని శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధికి మరో రూ.5 కోట్ల సాయాన్ని కూడా అదించనున్నారు. ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మన బడి-మన భవిష్యత్తు పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ స్కూల్స్‌ అభివృద్ధికి ఎన్ఆర్ఐలు, పూర్వ విద్యార్థుల్ని భాగస్వామ్యం చేస్తోంది. స్కూల్స్ అభివృద్ధికి సాయం చేస్తే.. ఆ స్కూల్స్‌కు దాతల పేర్లు పెట్టుకునే అవకాశం కల్పించింది.