హైదరాబాద్‌ చుట్టూ ఐటీ గ్రిడ్‌.. కొడంగల్‌లో మల్టీ పర్పస్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌

Wait 5 sec.

తెలంగాణ ప్రవేశపెట్టింది. బడ్జెట్‌ను రూ.3,24,234 కోట్లతో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శుక్రవారం (మార్చి 20) అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. బడ్జెట్‌లో పారిశ్రామికాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పరిశ్రమలు, ఐటీ శాఖకు ప్రాధాన్యమిచ్చింది. పరిశ్రమల శాఖకు మెుత్తంగా రూ.3,490 కోట్లను, ఐటీ శాఖకు రూ.875 కోట్ల కేటాయింపులు చేసింది. దేశంలోని మొత్తం గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లలో(జీసీసీల్లో) సుమారు 20 శాతం హైదరాబాద్‌లోనే ఉన్నాయని వెల్లడించారు. 2024-25లో 70కి పైగా కొత్త జీసీసీలు నగరంలో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రపంచ టెక్‌ దిగ్గజం గూగుల్‌ కంపెనీ హైదరాబాద్‌ నగగరంలో గూగుల్‌ సేఫ్టీ ఇంజినీరింగ్‌ సెంటర్‌ను నెలకొల్పిందన్నారు. హైదరాబాద్‌ పశ్చిమ ప్రాంతానికే ఐటీ పరిమితం కాకుండా.. నగరం చుట్టూ విస్తరించడానికి గ్రిడ్‌(గ్రోత్‌ ఇన్‌ డిస్‌పెర్షన్‌) విధానాన్ని ప్రోత్సహిస్తున్ననట్లు వెల్లడించారు. ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాలకు టి-ఫైబర్‌ ద్వారా సురక్షితమైన హై-స్పీడ్‌ ఇంటర్నెట్‌ ఇవ్వాలనే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా 424 మండలాల్లోని 8,888 గ్రామపంచాయతీలకు, 4,800 ప్రభుత్వ సంస్ధలకు ఫైబర్‌ అనుసంధానం చేసినట్లు తెలిపారు. ఈ సంవత్సరాంతానికి 50 వేల ప్రభుత్వ సంస్థలకు ఈ సౌకర్యం కల్పించాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఐటీ రంగంలో తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న అభివృద్ధి దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. తెలంగాణ ఐటీ ఎగుమతులు రూ.3.13 లక్షల కోట్లకు చేరుకొని.. 9.39 లక్షల మందికి పైగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయని అన్నారు. రాష్ట్ర డేటా సెంటర్‌ ఆధునికీకరణ కోసం అదనంగా రూ.100 కోట్లను బడ్జెట్‌లో కేటాయించినట్లు చెప్పుకొచ్చారు. తెలంగాణ పశ్చిమ ప్రాంతంలోని కొడంగల్‌ మున్ముందు ప్రధాన పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చెందనుందని అన్నారు. కొత్తగా నిర్మించనున్న రేడియల్‌ రోడ్‌-2 సమీపంలో భారీ ఇండస్ట్రియల్ పార్కుల కోసం భూములను సమీకరించనున్నామని చెప్పారు. కొడంగల్‌ మల్టీ పర్పస్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌ను కూడా అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో జహీరాబాద్‌ ఇండస్ట్రియల్‌ స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టును వేగంగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకొచ్చారు. 3,245 ఎకరాల విస్తీర్ణంలో జాతీయ పారిశ్రామిక కారిడార్‌ అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. గ్రామీణ చిన్నతరహా పరిశ్రమలకు రూ.241.96 కోట్ల కేటాయించామన్నారు. హైదరాబాద్‌ నగరంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న యూనిటీ మాల్‌కు రూ.173.16 కోట్లను, పారిశ్రామికాభివృద్ధి ప్రోత్సాహకాలకు మరో రూ.655 కోట్లను దాంతో పాటుగా హైదరాబాద్‌ నగరం మినహా మిగిలిన ఉమ్మడి 9 జిల్లాల్లో కొత్త పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి కోసం రూ.146.50 కోట్లను ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రతిపాదించిందని చెప్పుకొచ్చారు.