రైలు ప్రయాణికులకు గమనిక.. కొత్తగా ఎక్స్‌ప్రెస్ సహా మూడు రైళ్లు అక్కడ కూడా ఆగుతున్నాయి

Wait 5 sec.

శ్రీకాకుళం జిల్లావాసులకు శుభవార్త.. కొత్తగా మూడు రైళ్లకు హాల్ట్‌లు ఇచ్చారు. కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు మూడు రైళ్ల హాల్ట్‌లను ప్రారంభించారు. హరిశ్చంద్రపురం రైలునిలయంలో మంత్రి అచ్చెన్నాయుడు, డీఆర్‌ఎం లలిత్‌బోహ్రోలతో కలిసి గుణుపూర్‌- విశాఖ ఎక్స్‌ప్రెస్, పాతపట్నం రైలు నిలయంలో రవుర్కెలా నుంచి గుణుపురం వెళ్లే రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్, మందస రైలు నిలయంలో బ్రహ్మపురం-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్‌ హాల్ట్‌లకు జెండా ఊపారు. శ్రీకాకుళం నుంచి నేరుగా తిరుపతి, హైదరాబాద్‌కు రైళ్లు నడిచేలా తనవంత ప్రయత్నం చేస్తానన్నారు రామ్మోహన్ నాయుడు. ఇప్పటికే రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను రిక్వెస్ట్ చేశానని.. ప్రస్తుతం అవసరమైన సర్వే జరుగుతోందన్నారు. శ్రీకాకుళం జిల్లా రైల్వే రంగ అభివృద్ధిలో నేడు చారిత్రాత్మక రోజుగా రామ్మోహన్ నాయుడు అభివర్ణించారు. కేవలం 45 రోజుల వ్యవధి లో 6 రైల్వే హాల్ట్‌లకు మంజూరు లభించడం ఎంతో గర్వించదగ్గ క్షణం అన్నారు. 'హరిశ్చంద్రపురం లో విశాఖ – గుణపూర్ పాసింజర్ రైలు, మందస రోడ్డు వద్ద బ్రహ్మపూర్ – విశాఖపట్నం రైలు, పాతపట్నంలో రూర్కెల – గుణపూర్ రాజ్యరాణి రైళ్ల హాల్ట్‌లను రాష్ట్ర మంత్రి శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారు , పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు గారు, వాల్తేర్ DRM లలిత్ బోహరా గారు, ఖుర్ధా రోడ్ డివిజన్ DRM సునీల్ గారితో కలిసి ప్రారంభించడం ఆనందం గా ఉంది' అంటూ రామ్మోహన్ ట్వీట్ చేశారు. 'రైతులు, మహిళలు, విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా మారనుంది. అదనంగా, జిల్లాలోని రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫామ్‌లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌లు వంటి మౌలిక సదుపాయాలను దశలవారీగా అభివృద్ధి చేస్తూ, రవాణా వ్యవస్థను మరింత బలపరచడమే కాకుండా ఉపాధి అవకాశాలను కూడా పెంచే దిశగా కృషి చేస్తున్నాం. శ్రీకాకుళం జిల్లాలో రైల్వే అభివృద్ధికి అమూల్యమైన సహకారం అందిస్తున్న గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి, కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ గారికి జిల్లా ప్రజల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము' అన్నారు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు.