KKRకి బౌలింగ్ కష్టాలు.. రీప్లేస్‌మెంట్ ఫైనల్ కాలేదన్న అభిషేక్ నాయర్

Wait 5 sec.

సీజన్ ప్రారంభానికి ముందు జట్టుకు భారీ షాక్ తగిలింది. కేకేఆర్ కీలక పేసర్ హర్షిత్ రాణా గాయం కారణంగా దూరమవుతుండగా, రూ. 18 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన మతీషా పతిరణ కూడా ఏప్రిల్ మధ్యలోనే జట్టులోకి రానున్నాడు. దాంతో ఇప్పుడు కేకేఆర్‌కి బౌలింగ్ కష్టాలు మొదలయ్యాయి. కేకేఆర్ హెడ్ కోచ్ అభిషేక్ నాయర్ మాట్లాడుతూ, “హర్షిత్ రాణా గత రెండు సీజన్లలో జట్టుకు కీలక ప్లేయర్‌గా ఉన్నాడు. అతని గాయం ఇప్పుడు జట్టుకు పెద్ద దెబ్బ. గత కొన్ని రోజులుగా పలువురు బౌలర్లను పరిశీలిస్తున్నాం. కానీ ఇప్పటివరకు ఎవర్నీ ఫైనల్ చేయలేదు” అని క్లారిటీ ఇచ్చాడు.హర్షిత్ రాణా కుడి మోకాలిలో గాయం కారణంగా సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్‌లో హర్షిత్ గాయపడ్డాడు. ప్రస్తుతం అతని రికవరీ కొనసాగుతుండగా, తిరిగి ఎప్పుడు మైదానంలోకి వస్తాడన్నది ఇంకా స్పష్టత లేదు. ఇక పతిరణ పరిస్థితి కూడా కేకేఆర్‌కి ఆందోళన కలిగిస్తోంది. శ్రీలంక క్రికెట్ బోర్డు అతను రీహాబ్ పూర్తి చేసుకుని ఫిట్‌గా ఉన్నాడని తెలిపినా, మ్యాచ్ ఫిట్‌నెస్‌కు రావడానికి మరికొంత సమయం పడుతుందని కోచ్ నాయర్ వెల్లడించారు. “ప్రస్తుతం మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం, పతిరణ ఏప్రిల్ మధ్యలో మ్యాచ్ ఫిట్ అవుతాడు” అని అభిషేక్ నాయర్ చెప్పాడు. శ్రీలంక బోర్డు నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇంకా పూర్తిగా క్లియర్ కాలేదని సమాచారం. ఫిట్‌నెస్ టెస్ట్ పూర్తి చేసిన తర్వాతే అతడిని జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.బౌలింగ్‌లో లోటును భర్తీ చేయడానికి కేకేఆర్ ఇప్పటికే ఒక మార్పు చేసింది. బంగ్లాదేశ్ పేసర్ ముస్తఫిజుర్ రహ్మాన్ స్థానంలో జింబాబ్వే ఫాస్ట్ బౌలర్ బ్లెస్సింగ్ ముజరబానీను జట్టులోకి తీసుకుంది. అయితే ఈ కాంబినేషన్ సరిపోదని భావిస్తున్న మేనేజ్‌మెంట్ మరో బౌలర్ కోసం గాలిస్తోంది. ఇదే సమయంలో న్యూజిలాండ్ ప్లేయర్స్ ఫిన్ అలెన్, టిమ్ సైఫర్ట్, రచిన్ రవీంద్ర త్వరలో జట్టుతో కలవనున్నారు. బ్యాటింగ్ విభాగంలో బలంగా ఉన్నా, పేస్ అటాక్‌లో మాత్రం వీక్‌గా ఉంది. ఐపీఎల్ 2026లో మార్చి 29న ముంబై ఇండియన్స్‌తో జరిగే తొలి మ్యాచ్‌కు ముందు కేకేఆర్ సరైన బౌలింగ్ కాంబినేషన్ సిద్ధం చేయడం కోచ్ అభిషేక్ నాయర్‌కు పెద్ద సవాలుగా మారింది. గతేడాది దారుణంగా విఫలమైన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు అభిషేక్ నాయర్ నేతృత్వంలో టైటిల్ దిశగా ముందుకు వెళ్తుందని అందరూ భావిస్తున్నారు.