పెళ్లిళ్లలో డీజేలు, ప్రీ వెడ్డింగ్ షూట్‌లు బంద్.. గ్రామంలో మద్యపాన నిషేధం.. ఉల్లంఘిస్తే రూ.50 వేల ఫైన్

Wait 5 sec.

ప్రస్తుతం ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. పెళ్లిళ్లు అంటే.. జోష్ కోసం డీజేలు, ప్రీ వెడ్డింగ్ షూట్‌లు, సంగీత్‌లు, హల్దీలు అంటూ రకరకాల ఈవెంట్లు చేస్తున్నారు. కేవలం పెళ్లిళ్లకు మాత్రమే కాకుండా చిన్న చిన్న ఫంక్షన్లకు కూడా డీజేలతో దుమ్మురేపుతున్నారు. పట్టణాలు, గ్రామాలు అని తేడా లేకుండా ఎక్కడ చూసినా సందడి మామూలుగా ఉండటం లేదు. అయితే డీజే సౌండ్‌తో చిన్న పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో మంచాన పడినవారు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ గ్రామం కీలక నిర్ణయం తీసుకుంది. డీజేలు, ప్రీ వెడ్డింగ్ షూట్‌లపై నిషేధం విధించింది. యువత చెడిపోకుండా ఉండేందుకు మద్యంపై బ్యాన్ విధించింది. నిబంధనలను ఉల్లంఘిస్తే రూ.50 వేల జరిమానా విధిస్తామని గ్రామ పెద్దలు హెచ్చరించారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం.. ఖైరీగూడ గ్రామం ఈ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. గ్రామంలో పెరిగిపోతున్న అనవసర ఖర్చులు, యువత పెడదోవ పడుతుండటంతో కీలక నిర్ణయానికి ఆమోదం తెలిపింది. గ్రామంలో కఠిన నిబంధనలను అమలు చేసేందుకు గ్రామస్థులంతా కలిసి సామూహికంగా ఒక తీర్మానం చేశారు.పెళ్లిళ్ల సమయంలో గ్రాండ్‌గా నిర్వహించే ప్రీ వెడ్డింగ్ షూట్లు, హల్దీ వేడుకలు నిర్వహించడంపై ఖైరీగూడ గ్రామస్తులు నిషేధం విధించారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల అనవసరంగా డబ్బు ఖర్చు చేయడమే కాకుండా.. సామాజికంగా కూడా కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయని ఖైరీగూడ గ్రామస్థులు అభిప్రాయం వ్యక్తం చేశారు. అదే సమయంలో అర్ధరాత్రి వరకు గ్రామంలో దుమ్ములేపే డీజే సౌండ్ సిస్టమ్ ఉపయోగించడంపైనా పూర్తి నిషేధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఖైరీగూడ గ్రామస్థులు.. గ్రామసభ నిర్వహించి అందులో ఏకీగ్రీవంగా ఈ నిబంధనలను ఆమోదించారు. ఒకవేళ.. ఎవరైనా ఈ రూల్స్‌ను అతిక్రమిస్తే.. వారికి రూ.50,000 ఫైన్ వేయాలని తీర్మానం చేశారు. గ్రామస్తుల ఆరోగ్యం.. శాంతి భద్రతలు, ఖర్చుల విషయాన్ని దృష్టిలో పెట్టుకుని.. ఈ నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో ఖైరీగూడ గ్రామంలో మద్యం విక్రయాలు, నాటు సారా తయారీ, ఇతర మత్తు పదార్థాలపై పూర్తిగా నిషేధం విధించారు. గ్రామంలో ప్రతీ ఒక్కరికీ ఈ రూల్స్ వర్తిస్తాయని.. ఇందులో నుంచి ఎవరికీ మినహాయింపు లేదని గ్రామసభ తీర్మానంలో తేల్చి చెప్పారు. అప్పులు చేసి ఆడంబరాలకు పోవడం కంటే.. ఉన్న దాంట్లో ప్రశాంతంగా పెళ్లి చేసుకోవడమే మేలని ఈ గ్రామస్థులు మిగిలిన గ్రామాలకు చాటిచెప్పారు. ఇలా చేయడం వల్ల కేవలం డబ్బును మాత్రమే ఆదా చేయడం కాకుండా.. సంప్రదాయం పేరుతో జరుగుతున్న అతి చర్యలను అరికట్టే ప్రయత్నం చేస్తున్నట్లు గ్రామస్థులు పేర్కొంటున్నారు. ఇలాంటి నిర్ణయాలను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఊరిలోనూ ఇవే తీర్మానాలు చేస్తే.. సామాన్యుడి పెళ్లి మళ్లీ ఒక వేడుకలా మారుతుందే తప్ప భారం కాదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.