తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ కేసుకు సంబంధించి.. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ తన వివరణను టీడీపీ అధిష్టానానికి తెలియజేశారు. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో టీడీపీ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డి సహా పలువురు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై టీడీపీ అధిష్టానం సీరియస్‌గా స్పందించింది. ఫాంహౌస్ ఘటనపై వివరణ ఇవ్వాలంటూ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఐదు రోజులు గడువు విధించింది. అలాగే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని పుట్టా మహేష్ యాదవ్‌కు స్పష్టం చేసింది. మరోవైపు టీడీపీ అధిష్టానం ఇచ్చిన గడువు ముగుస్తుండటంతో.. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ తన వివరణను అధిష్టానానికి పంపినట్లు తెలిసింది. శుక్రవారం నాటితో ఐదు రోజుల గడువు పూర్తి కాగా.. గురువారం రాత్రే పుట్టా మహేష్.. తన వివరణను లిఖితపూర్వకంగా పార్టీ అధిష్టానానికి పంపించినట్లు సమాచారం. అయితే పుట్టా మహేష్ వివరణను టీడీపీ అధిష్టానం గోప్యంగా ఉంచినట్లు తెలిసింది. ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ వివరణను పూర్తిగా పరిశీలించిన అనంతరం.. టీడీపీ అధిష్టానం ఓ నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ కేసులో పాజిటివ్‌గా తేలటంతో.. పుట్టా మహేష్ యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఆయనకు స్టేషన్ బెయిల్ ముంజూరైంది. అదే రోజు సోషల్ మీడియా ద్వారా వీడియో విడుదల చేసిన పుట్టా మహేష్.. ఈ ఘటనపై తన వివరణను తెలియజేశారు. తాను ఎలాంటి తప్పూ చేయలేదని.. తనకు ఎలాంటి దురలవాట్లూ లేవంటూ వీడియో విడుదల చేశారు. చాలా రోజుల నుంచి స్నేహితులు పిలుస్తున్నారని.. వీలు చిక్కడంతో ఆ రోజు మొయినాబాద్ ఫాంహౌస్‌కు వెళ్లినట్లు చెప్పారు. డిన్నర్ సమయంలో తానేమీ చేయలేదని.. మీడియాలో, సోషల్ మీడియాలో వచ్చే కథనాలను నమ్మవద్దని కోరారు. అయితే పుట్టా మహేష్ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం కావటంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. పార్టీకి నష్టం కలిగించే చర్యలను ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. చంద్రబాబు ఆదేశాలతో టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు.. పుట్టా మహేష్ యాదవ్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. తాజాగా ఈ నోటీసులకు పుట్టా మహేష్ యాదవ్ తన వివరణ తెలియజేశారు.