పశ్చిమ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో శనివారం ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలలో వర్షం పడనుంది. వచ్చే 24 గంటలలో (శనివారం) ఏపీలోని ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ జిల్లాలలో వర్షం కురిసేందుకు అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు వెల్లడించారు. అలాగే 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ఈ ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తులో కొనసాగుతున్నట్లు వెల్లడించారు. మరోవైపు ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఏపీలో మరో రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ సైతం హెచ్చరించింది. శని, ఆదివారాలలో ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.వర్షాల నేపథ్యంలో రైతులు తమ పంటలను తడవకుండా భద్రపరుచుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో చెట్ల కింద ఉండొద్దని సూచించారు. వర్షం కురిసే సమయంలో శిథిలావస్తలో ఉన్న భవనాలు, భారీ హోర్డింగులు కింద నిలబడవద్దని సూచించారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.మరోవైపు ఎండాకాలంలో కురుస్తున్న ఈ అకాల వర్షాలతో పగటి పూట ఉష్ణోగ్రతలు తగ్గి ప్రజలు ఎండ వేడిమి నుంచి కాస్త ఉపశమనం పొందుతున్నారు. అయితే రైతన్నలకు మాత్రం ఈ వర్షాలు నష్టాలను మిగుల్చుతున్నాయి.ఎండాకాలంలో కురుస్తున్న వడగండ్ల వానలతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట.. అకాల వర్షాల కారణంగా దెబ్బతింటోందని వాపోతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు. మరోవైపు ఏపీలోని ఆరు జిల్లాల పరిధిలో ఉన్న మొత్తం16 మండలాలపై ఈ వర్షాలు ప్రభావం చూపినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అకాల వర్షాలపై సీఎం చంద్రబాబు సైతం ఇప్పటికే ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అకాల వర్షాలు, వడగండ్ల పడేచోట్ల ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో అకాల వర్షాలు, వడగళ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిహారం అందిస్తామని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.