యూట్యూబర్ వైష్ణవి హత్య.. చెల్లిని వదిలి క్షణం ఉండలేను, సమాధిపై పడుకుని అన్నయ్య రోదన

Wait 5 sec.

జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామంలో యూట్యూబర్ వైష్ణవిని.. వరకట్న వేధింపులతో తన భర్తే పొట్టనబెట్టుకోవడం రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే వైష్ణవి మృతిని ఆమె అన్న సంతోష్ అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాడు. చెల్లి ఇక లేదని.. రాదనే నిజాన్ని నమ్మలేక.. ఆమెను పూడ్చిపెట్టినన సమాధి వద్దే పగలు, రాత్రి గడుపుతున్నాడు. తన చెల్లికి ఇష్టమైన పదార్థాలను వండి తీసుకెళ్లి.. సమాధి వద్ద పెడుతూ, అక్కడే నిద్రిస్తూ తన అపారమైన ప్రేమను చాటుకుంటున్నాడు. ఆ సమాధిని హత్తుకుని సంతోష్ విలపిస్తున్న తీరు ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి గురిచేస్తోంది.వైష్ణవి హత్య కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. హత్యకు పాల్పడిన భర్త హరిబాబుతో పాటు, ఈ ఘాతుకానికి ప్రేరేపించిన అతని తల్లిని, ఇద్దరు సోదరులను కూడా పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వీరిని రిమాండ్‌కు తరలించి లోతుగా విచారణ జరుపుతున్నారు. కేవలం డబ్బు కోసమే ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్న ఈ కిరాతకులకు కఠిన శిక్ష పడాలని గ్రామస్థులు, కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.యూట్యూబర్‌గా అందరికీ పరిచయమైన వైష్ణవి ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశమైంది. ఇద్దరు అన్నలకు ప్రాణమైన చెల్లి ఇలా విగతజీవిగా మారడం ఆ కుటుంబాన్ని కోలుకోలేని దెబ్బ తీసింది. నిందితులకు ఉరిశిక్ష పడే వరకు తాము విశ్రమించబోమని, తమ చెల్లి ఆత్మకు అప్పుడే శాంతి కలుగుతుందని ఆమె సోదరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అయ్యప్పగుట్టకు చెందిన హరిబాబుకు.. మాదాపూర్ గ్రామానికి చెందిన వైష్ణవికి సంవత్సరం క్రితం లవ్ మ్యారేజ్ జరిగింది. ఈ జంట మొదట్లో బాగానే కలిసి ఉండగా.. ఏడు నెలల క్రితం ఒక యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టారు. దీంతో హరిబాబు, వైష్ణవి యూట్యూబ్ ఛానల్‌కు విపరీతమైన ఫాలోయింగ్ రావడంతో.. ఇప్పటివరకు ఆ ఛానెల్‌కు 58 వేల మంది సబ్‌స్క్రైబర్లు వచ్చారు. ఆ తర్వాత వారి మధ్య గొడవలు ప్రారంభం అయ్యాయి. తల్లి, అన్న మాటలు విని హరిబాబు.. అదనపు వరకట్నం కోసం.. వైష్ణవిని చిత్రహింసలకు గురి చేసేవాడు. ఈ క్రమంలోనే ఆమె గర్భం దాల్చింది. అయితే వైష్ణవి 4 నెలల గర్భవతి అని కూడా చూడకుండా.. అతి దారుణంగా హరిబాబు ఇటీవల హతమార్చాడు.