పశ్చిమ్ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలు యావత్తు దేశాన్ని ఆకర్షిస్తున్నాయి. అధికార తృణమూల్‌ హ్యాట్రిక్ కొడుతుందా? బీజేపీ తొలిసారి అధికారం చేపడుతుందా? అనేది ఆసక్తికంగా మారింది. అధికార, విపక్షాలు విమర్శలు, ప్రతి విమర్శలతో బెంగాల్ రాజకీయాలు వేడెక్కాయి. ఈ నేపథ్యంలో అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎన్నికల మేనిఫెస్టోను శుక్రవారం విడుదల చేశారు. వరుసగా నాలుగోసారి అధికారమే లక్ష్యంగా పది కీలక హామీలను దీదీ ప్రకటించారు. మళ్లీ తాము అధికారంలోకి వస్తే అమలు చేసి తీరుతామని పేర్కొన్నారు. మమతా హామీల్లో మహిళలకు ఆర్థిక సాయం పెంపు, నిరుద్యోగ భృతి, పాఠశాలలు ఆధునుకీకరణ, కొత్త జిల్లాలు, మున్సిపాల్టీలు ఏర్పాటు, ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ తదితరాలు ఉన్నాయి.చేసిన సంగతి తెలిసిందే. 77 మంది సిట్టింగ్‌లకు ఈసారి టిక్కెట్ నిరాకరించారు. ప్రస్తుతం నెల నెల మహిళలకు ఇస్తున్న రూ.1,000 ఆర్థిక సాయాన్ని మరో రూ.500 పెంచుతామని పేర్కొన్నారు. దీంతో నిరుద్యోగ యువతకు భృతి కింద నెలకు రూ.1,500 ఇస్తామని ప్రకటించారు. ఇంటి వద్దకే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తామని, ఇందుకోసం వైద్యశిబిరాలను ఏర్పాటుచేస్తామని బెంగాల్ సీఎం హామీ ఇచ్చారు.పాఠశాలలను అధునీకరించి, ఈ-లెర్నింగ్‌ సౌకర్యాలను కల్పిస్తామని మమతా తెలిపారు. కొత్తగా మరో ఏడు జిల్లాలు, మున్సిపాల్టీలను ఏర్పాటుచేయనున్నట్టు ఆమె పేర్కొన్నారు. రైతుల కోసం రూ.30 వేల కోట్లతో ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్‌ను తీసుకొస్తామని అన్నారు. ప్రతి కుటుంబానికీ పక్కా ఇంటి నిర్మాణం, ఇంటింటికీ శుద్ధిచేసిన తాగునీటి అందేలా చర్యలు తీసుకుంటామని మేనిఫెస్టోలో వెల్లడించారు. ప్రపంచ స్థాయి లాజిస్టిక్స్‌, పోర్టులు, వాణిజ్య మౌలిక వసతులు, అత్యాధునిక గ్లోబల్‌ ట్రేడ్‌ సెంటర్‌‌ను అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని పెట్టుబడులు, వ్యాపారాలకు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దుతామని వివరించారు. అర్హులైన అందరికీ వృద్ధాప్య పింఛన్లు నిరంతరాయంగా అందజేస్తామని మమతా బెనర్జీ హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా మరోసారి కేంద్రంలోని బీజేపీతో పాటు ఎన్నికల కమిషన్‌పై దీదీ విరుచుకుపడ్డారు. ఎన్నికల తర్వాత NRC, జనాభా లెక్కల సేకరణ పేరుతో ప్రజల పౌరసత్వాన్ని తొలగించేందుకు మోదీ సర్కారులు ప్రణాళికలు రచిస్తోందని దుయ్యబట్టారు. అంతేకాదు, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు సహకరించేలా నియోజకవర్గాల పునర్‌‌ వ్యవస్థీకరణకు ఈసీ, కేంద్రం కుట్రలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ఓడిపోతారని బీజేపీకి తెలుసు కాబట్టే బెంగాల్‌లో ‘అనధికార రాష్ట్రపతి పాలన’ను విధించారని ఆరోపించారు. రాష్ట్రాన్ని కాపాడుకోడానికి బీజేపీకి వ్యతిరేకంగా కలిసి పోరాటం చేయాలని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు. బెదిరింపులు, ప్రలోభాలకు గురిచేసినా అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. తనకు అన్ని మతాలూ సమానమేనని, విభజన రాజకీయాలు చేయడంలేదని తెలిపారు. పశ్చిమ్ బెంగాల్‌లో ఏప్రిల్‌ 23, 29 తేదీల్లో రెండు విడతల్లో పోలింగ్‌ జరగనున్నాయి. ఓట్లను మే 4న లెక్కించి ఫలితాలు వెలువడనున్నాయి.