రైతు భరోసా కొత్త అప్లికేషన్లు ప్రారంభం.. కావాల్సిన పత్రాలు, ప్రాసెస్ ఇదే..

Wait 5 sec.

తెలంగాణ ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం అయింది. త్వరలోనే ఆ డబ్బులు అన్నదాతల ఖాతాల్లో జమ కానున్నాయి. కాగా, ఇప్పటి వరకు రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అందని రైతులకు సర్కార్ తీపి కబురు చెప్పింది. కొత్తగా రైతుల నుంచి రైతు భరోసా అప్లికేషన్లు స్వీకరిస్తోంది. కొత్తగా పట్టా పొందిన రైతులు అంటే 28.02.2026 లోపు పట్టా పొందిన రైతులు కొత్తగా రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రైతు వేదికలు, వ్యవసాయ విస్తరణ అధికారులను కలిసి అప్లికేషన్లు ఇవ్వొచ్చు. అందుకు రైతులు తమ ఆధార్ కార్డు, పట్టా పాస్ పుస్తకం, బ్యాంకు అకౌంట్ జిరాక్స్, రైతు భరోసా అప్లికేషన్ ఫారంతో పాటు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ఫారంలో పూర్తి వివరాలు నింపి రైతు వేదికల్లో అందజేయాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. కొత్తగా పట్టాలు పొందిన వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సలహా ఇస్తున్నారు. కాగా, తెలంగాణ అన్నదాతకు రేవంత్ సర్కార్ ఇటీవల శుభ‌వార్త చెప్పింది. ఈ నెల 22 నుంచి రైతుల ఖాతాల్లో రైతుభ‌రోసా నిధులు విడుద‌ల చేయాల‌ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రైతు భ‌రోసా నిధులు విడుద‌ల‌పై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో చర్చించారు. మొదటి విడతగా ఈ నెల 22వ తేదీన సిద్దిపేట జిల్లా న‌ర్మెట్ట నుంచి 70 లక్షల మంది రైతులకు ఎక‌రం వ‌ర‌కు రూ.3,590 కోట్లు నిధులను రైతుల ఖాతాల్లోకి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బ‌దిలీ చేయ‌నున్నారు. త‌ర్వాత మ‌రో 20 రోజుల‌కు రూ.2,650 కోట్లు రెండో విడతలో రైతుల ఖాతాల్లో జ‌మ చేయ‌నున్నారు. ఏప్రిల్ నెలాఖ‌రులోగా మిగిలిన రైతులకు మూడో విడత రైతు భరోసా పంట పెట్టుబడి సాయాన్ని వారి ఖాతాల్లోకి బ‌దిలీ చేయ‌నున్నారు. మొత్తంగా 1.50 కోట్ల ఎకరాలకు సంబంధించి రూ.9 వేల కోట్లు రైతు భ‌రోసా నిధులు అన్నదాతల ఖాతాల్లో జమ కానున్నాయి. ప్రభుత్వ నిర్ణయం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పంట సాగుకు సిద్ధమవుతున్న తమకు ఈ సాయం ఆర్థికంగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. కాగా, ఎకరాకు రూ.12 వేల చొప్పున ఇస్తున్న సంగతి తెలిసిందే. ఏడాదిలో రెండుసార్లు రూ.6 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు.