ధర భారీగా దిగొస్తున్నా బంగారానికి తగ్గిన డిమాండ్.. IBJA కీలక ప్రకటన.. కారణం ఇదే!

Wait 5 sec.

Gold Prices Fall: ఇటీవల యుద్ధం ఉన్నప్పటికీ.. భారీగా తగ్గుతూ వచ్చిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ బంగారానికి డిమాండ్ మాత్రం తగ్గింది. . 24 క్యారెట్ల పసిడి ధర మార్చి 2న 10 గ్రాములకు రూ. 1.67 లక్షల మార్కుపైన ఉండగా.. ఇప్పుడు అది మార్చి 16న రూ. 1.55 లక్షల స్థాయికి దిగొచ్చింది. దీంతో 2 వారాల్లోనే రూ. 12 వేలకుపైగా ధర తగ్గింది. ఇక్కడ బంగారం ధరలు తగ్గేందుకు చాలానే కారణాలు ఉన్నాయి. అయినప్పటికీ గరిష్ఠాల నుంచి బంగారం ధర భారీగా దిగొచ్చినా.. కొనుగోళ్లు మాత్రం పెరగలేదు. ఇంకా ఇదే సమయంలో కొనుగోళ్లు తగ్గినట్లు ఇండియన్ బులియెన్ జువెల్లర్స్ అసోసియేషన్ (IBJA) వెల్లడించింది. 'బంగారానికి డిమాండ్ ఇటీవలి కాలంలో భారీగా తగ్గుతూ వచ్చింది. రిటైల్ కస్టమర్లకు ప్రస్తుతం బంగారం కొనుగోలు చేయాలన్న ఆసక్తే లేనట్లు తెలుస్తోంది. చాలా వరకు జనం ఫ్యూయెల్, గ్యాస్, ఇతర నిత్యావసర సరకుల కొనుగోళ్ల కోసం డబ్బును పొదుపు చేస్తున్నట్లు కనిపిస్తోంది.' అని ఐబీజేఏ సెక్రటరీ సురేంద్ర మెహ్తా చెప్పారు. యుద్ధం ప్రారంభానికి ముందు ఫిబ్రవరి 27న గోల్డ్ రేటు 24 క్యారెట్లపై తులం రూ. 1.59 లక్షల స్థాయిలో ఉండేది. యుద్ధం ప్రారంభమైన తొలి 2 రోజుల్లో ఇది భారీగా పెరిగి రూ. 1.67 లక్షల స్థాయికి చేరింది. ఇక అక్కడి నుంచి యుద్ధం తీవ్రరూపం దాల్చినా బంగారం ధర పతనం అవుతూ వస్తోంది. ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా.. క్రూడాయిల్ ధర ఇటీవల విపరీతంగా పెరుగుతూ వచ్చిన సంగతి తెలిసిందే. యుద్ధానికి ముందు బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్‌కు 70 డాలర్ల స్థాయిలో ఉండగా.. ఒక దశలో ఇది మళ్లీ 120 డాలర్లను చేరింది. అక్కడి నుంచి కాస్త తగ్గి ప్రస్తుతం 100 డాలర్లపైనే ఉంది. ఇది యూఎస్ డాలర్, బాండ్ ఈల్డ్స్ పుంజుకునేందుకు దోహదం చేయడం వల్ల బంగారానికి డిమాండ్ తగ్గుతూ వచ్చింది. ఇదే సమయంలో బంగారం ఆకర్షణ కోల్పోయింది. దీంతో పెట్టుబడులు తగ్గి.. ధర కూడా తగ్గుతూ వస్తుందని మెహ్తా అన్నారు. ఈ క్రమంలోనే ధర తగ్గుతున్నా.. ప్రజల నుంచి పసిడి కొనుగోళ్లు ఏ మాత్రం పెరగలేదని వివరించారు. జువెల్లరీల్లో కళ తగ్గిందని చెప్పుకొచ్చారు. ఇది జువెల్లరీలకు కూడా ఆర్థిక సంవత్సరం చివర్లో.. ఇబ్బందుల్ని కలిగిస్తోందని పేర్కొన్నారు. ఇప్పుడు యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయంపై ఇన్వెస్టర్లు దృష్టి సారించారని వివరించారు. ఫెడ్ కీలక సమావేశం మార్చి 17-18 తేదీల్లో జరగనుంది. గత కొన్ని సమీక్షల్లో వడ్డీ రేట్లను తగ్గించినప్పటికీ.. ఈసారి మాత్రం యథాతథంగానే ఉంచనున్నట్లు భావిస్తున్నారు.