22ఏ జాబితా నుంచి ఏపీఐఐసీ భూముల తొలగింపు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 22ఏ నిషేదిత భూముల జాబితా నుంచి ఏపీఐఐసీ భూములను తొలగించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో పారిశ్రామిక రంగ అభివృద్ధి, పరిశ్రమల ఏర్పాటు కోసం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శి ఎన్. యువరాజ్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే సంస్థలకు రాయితీలు, భూములు కేటాయిస్తోంది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు కాగా.. మరికొన్ని చోట్ల భూములను గుర్తించే పనిలో ఉన్నారు. అయితే పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే సంస్థలు, ఎంఎస్ఎంఈ పార్కుల కోసం ఏపీఐఐసీకి చెందిన భూములను కూడా ఏపీ ప్రభుత్వం కేటాయిస్తోంది. అయితే కొన్నిచోట్ల ఏపీఐఐసీకి చెందిన భూములు 22ఏ నిషేధిత భూముల జాబితాలో ఉండటంతో ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే 22ఏ జాబితాలో ఉన్న ఏపీఐఐసీ భూములను.. అందులో నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రజలకు పరిహారం చెల్లించి, ఆ తర్వాత ఏపీఐఐసీ కింద ఉన్న ప్రభుత్వ, డీకేటీ భూములను 22ఏ జాబితా నుంచి తొలగించాలని ఆదేశించింది. అలాగే ఎలాంటి అభ్యంతరాలు లేని 70000 ఎకరాలను ఈ జాబితా నుంచి తొలగించేందుకు అనుమతి ఇచ్చింది. దీనితో పాటుగా ఏపీఐఐసీ అధీనంలోని 51,603.46 ఎకరాల భూముల మ్యుటేషన్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలోనే రెవెన్యూ రికార్డులు, వెబ్‌ల్యాండ్‌లో ఏపీఐఐసీ పేరు మీద భూములను మార్చేలా చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్లను ఆదేశించింది. సబ్ రిజిస్ట్రార్ల ద్వారా 22ఏ నిషేధిత జాబితా నుంచి ఏపీఐఐసీ భూములను తొలగించేలా చర్యలు తీసుకోవాలంటూ ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే సంస్థలకు ప్రభుత్వం భూములు కేటాయిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టీసీఎస్, గూగుల్, కాగ్నిజెంట్ వంటి సంస్థలకు ఇప్పటికే భూములు కేటాయించారు.