అనంతపురం జిల్లాలోని తాడిపత్రి పోలీసులకు ఓ వింత ఫిర్యాదు అందింది. ఓ వ్యక్తి మటన్ సరిగా ఉడకలేదు మహాప్రభో అంటూ పోలీస్ స్టేషన్ గడప తొక్కాడు. సాధారణంగా ఆస్తి తగాదాలు, భూకబ్జాలు వంటి సివిల్ కేసులు.. హత్యలు, కిడ్నాప్‌లు వంటి క్రిమినల్ కేసులలో బాధితులు పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయిస్తుంటారు. అయితే మటన్ ఉడకలేదని మనోడు స్టేషన్‌కు రావటంతో.. పోలీసులు సైతం విస్తుపోయారు. ఎంత నాన్ వెజ్ ప్రియులు అయితే మాత్రం.. మటన్ సరిగా ఉడకలేదని.. బిర్యానీలో చికెన్ పీస్ రాలేదని స్టేషన్‌కు వస్తారా అని పోలీసులు సైతం ముక్కున వేలేసుకున్నారు. ఆనక మనోడు చెప్పిన సంగతి విని.. పెద్ద చిక్కొచ్చి పడిందని, అతనికి సర్ది చెప్పి ఇంటికి పంపించారు. అసలు సంగతికి వస్తే తాడిపత్రికి చెందిన ఓ వ్యక్తి.. మటన్ షాపు వద్ద మటన్ కొనుగోలు చేశాడు. ఉగాది పండుగ నేపథ్యంలో ఆదివారం రోజున నాన్‌వెజ్‌తో విందు చేసుకోవాలని నిర్ణయించుకున్న ఆ వ్యక్తి.. కుటుంబం కోసం మటన్, తలకాయ కొనుగోలు చేశాడు. ఆనక ఇంటికి తీసుకెళ్లి కుక్కర్‌లో వేశారు. ఇక కర్రీ ఎప్పుడు పూర్తవుతుందా అని వెయిటింగ్.. అసలే మసాలా వాసన నషాళానికి అంటుతోంది. మటన్ కూర పూర్తి అయితే ఓ పట్టు పట్టాలని గట్టి పట్టుదలగా ఉన్నాయి. సమయం గడుస్తోంది కానీ.. మటన్ ముక్కలు ఉడకటం లేదు. సాధారణంగా మటన్ ముక్కలు ఉడకటానికి కాస్త టైమ్ పడుతుంది. కానీ మనోడు తెచ్చిన మటన్ మాత్రం ఎంతసేపటికీ ఉడకటం లేదు. దీంతో చిరాకు వచ్చింది. కోపం నషాళానికి పాకింది.దీంతో మటన్ కూర వండిన పాత్రతో సహా పోలీస్ స్టేషన్ చేరుకున్నాడు. మటన్ సరిగా ఉడకడం లేదని.. తనకు మటన్ అమ్మిన వ్యాపారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదుచేశాడు. దీంతో పోలీసులు విస్తుపోయారు. వండిన పాత్రతో సహా స్టేషన్‌కు రావటంతో షాక్ తిన్నారు. ఆ తర్వాత మనోడికి కాస్త సర్దిచెప్పి అక్కడి నుంచి ఇంటికి పంపించారు. అయితే ఈ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి రావటంతో.. మనోడికి పెద్ద చిక్కొచ్చిపడిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు మాత్రం అంతంత డబ్బులు పెట్టి మటన్ కొనుగోలు చేసి, తినలేకపోతే ఎవరికైనా బాధేకదా అని ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా మనోడి వ్యవహారం తాడిపత్రి పోలీస్ స్టేషన్‌లో చర్చనీయాంశమైంది.