ప్రస్తుతం పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్‌పై భీకర దాడులు చేస్తుండగా.. ఇరాన్ కూడా ఇజ్రాయెల్ సహా గల్ఫ్ దేశాలపై తమదైన శైలిలో దాడులు చేస్తోంది. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రపంచ చమురు రవాణాకు కీలకంగా ఉన్న హర్మూజ్ జలసంధి ఇరాన్ ఆధీనంలో ఉండగా.. అక్కడి నుంచి చమురు సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో భారత్ సహా ప్రపంచ దేశాల్లో చమురు, గ్యాస్ కొరత ఏర్పడుతోంది. దీంతో ఆయా దేశాల్లో దారుణమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. మన దేశంలోనూ గ్యాస్ కొరత తలెత్తగా.. ఇటీవల పలు నౌకలు పోర్టులకు చేరడంతో కాస్త ఉపశమనం కలిగింది. అయితే యుద్ధం ఇప్పట్లో ఆగే పరిస్థితులు కనిపించకపోవడంతో.. రానున్న రోజుల్లో పరిస్థితులు మరింత దారుణంగా తయారయ్యే అవకాశాలు ఉన్నాయనే భయాలు నెలకొన్నాయి.ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రంలోని ప్రభుత్వం అలర్ట్ అయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో పలువురు సీనియర్‌ మంత్రులతో కీలక సమావేశం ఇవాళ సాయంత్రం నిర్వహించారు. దేశంలో గ్యాస్‌, పెట్రోలియం ఉత్పత్తులు, ముడి చమురు, ఎరువుల లభ్యత, విద్యుత్‌ రంగాలు ప్రస్తుతం ఎలా ఉన్నాయి అనే దానికి సంబంధించి సమీక్ష చేపట్టారు. దేశంలో నిరంతరాయంగా ఇంధనాన్ని సరఫరా చేయడం.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరకు రవాణా చేయడమే లక్ష్యంగా ఈ సమావేశం నిర్వహించినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.ఇక ఈ ఉన్నత స్థాయి కేబినెట్ భేటీకి.. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌.. హోం శాఖ మంత్రి అమిత్‌ షా.. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌ సింగ్ చౌహాన్‌.. విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌.. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌.. పీయూష్‌ గోయల్‌, జేపీ నడ్డా, అశ్వినీ వైష్ణవ్‌, హర్దీప్‌ సింగ్‌ పురీ, రామ్మోహన్‌ నాయుడు పాల్గొన్నారు. వీరితోపాటు జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్‌ ధోవల్ సహా వివిధ శాఖలకు సంబంధించిన కీలక ఉన్నతాధికారులు పాల్గొన్నారని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. పశ్చిమాసియలో ప్రస్తుతం నెలకొన్న యుద్ధ పరిస్థితులను సమీక్షించడంతోపాటు.. పెట్రోలియం ఉత్పత్తులు సహా దేశంలో నిత్యావసరాల సరఫరాకు అంతరాయం లేకండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని అధికార వర్గాలు తెలిపాయి