తిరుమల శ్రీవారి భక్తులకు తీపి కబురు. తిరుమలకు వచ్చే యాత్రికులు, భక్తుల వసతి కోసం తిరుపతిలోని అలిపిరి వద్ద ఇంటిగ్రేటెడ్‌ మోడల్‌ టౌన్‌షిప్‌ ఏర్పాటుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు టౌన్‌షిప్ ఏర్పాటుకు ఉన్న అవకాశాలపై నివేదిక సమర్పించాలని టీటీడీ ఈవో ఎం.రవిచంద్రను సీఎం చంద్రబాబు తాజాగా ఆదేశించారు. తిరుమలలో భక్తుల రద్దీకి అనుగుణంగా వసతి దొరక్కపోవడం, అదనంగా వసతి భవనాలు నిర్మించేందుకు అవకాశం లేకపోవడంతో అలిపిరిలో బేస్‌క్యాంప్‌ నిర్మించాలని టీటీడీ అధికారులు గతంలో ప్రతిపాదించారు. ఇదే విషయాన్ని టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు శనివారం తిరుమలకు వచ్చిన సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. బేస్‌క్యాంప్‌ ప్రతిపాదనను విస్తృతం చేసి ఇంటిగ్రేటెడ్‌ మోడల్‌ టౌన్‌షిప్‌కు పూర్తిస్థాయిలో సర్వే జరిపి అందుకు సంబంధించిన నివేదికలు సమర్పించాలని సీఎం చంద్రబాబు టీటీడీ అధికారులను ఆదేశించారు. తిరుమల కొండల్లో ఔషధమొక్కల పెంపకానికి కావాల్సిన చర్యలు చేపట్టాలని కూడా సూచించారు. తిరుమలలో పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఎలక్ట్రానిక్‌ సూచిక బోర్డులు మరిన్ని ఏర్పాటు చేయాలన్నారు. టీటీడీ విద్యుత్ అవసరాలు, విండ్ పవర్ ఉత్పాదన, వినియోగంపై నివేదికను ప్రభుత్వానికి అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్‌ ప్రారంభం.. ఇక తిరుమలలో అత్యంత ఆధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసిన సీఎం చంద్రబాబు శనివారం ప్రారంభించారు. సుమారు 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో, రూ.30 కోట్లకు పైగా వ్యయంతో రూపొందించిన ఈ ల్యాబ్ దేశంలోనే ఈ తరహాలో ఏర్పాటైన మొదటి అధునాతన కేంద్రం. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (FSSAI), రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మించిన ఈ ల్యాబ్‌లో రసాయన, మైక్రో బయాలాజికల్ విశ్లేషణల కోసం ప్రత్యేక విభాగాలను కేటాయించారు. శ్రీవారి ప్రసాదం, అన్నప్రసాదం తయారీలో వాడే ముడి పదార్థాల నాణ్యతను పరీక్షించడంతో పాటు, భక్తులకు అందే ఆహారం, నీరు సురక్షితంగా ఉండేలా నెలకు దాదాపు 1500 నమూనాలను ఇక్కడ పరీక్షిస్తారు.ఈ ల్యాబ్‌లో అమర్చిన 50కి పైగా అత్యాధునిక పరికరాలను సీఎం స్వయంగా పరిశీలించి, వాటి పనితీరును అధికారుల ద్వారా తెలుసుకున్నారు. ముఖ్యంగా ఆహారంలోని కొవ్వు ఆమ్లాలు, పురుగుమందుల అవశేషాలు, భారీ లోహాలను గుర్తించే GC-MS, ICP-MS, HPLC వంటి హై-టెక్ పరికరాలతో పాటు, ఆహార రుచి, వాసనను విశ్లేషించే ఈ-టంగ్, ఈ-నోస్ వంటి టెక్నాలజీలను ఇక్కడ అందుబాటులోకి తెచ్చారు. టీటీడీ వినియోగించే నెయ్యి, నూనెలు, ఇతర దినుసుల స్వచ్ఛతను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తనిఖీ చేయడం ద్వారా భక్తులకు నాణ్యమైన ప్రసాదాలను అందించడమే ఈ ల్యాబ్ ప్రధాన లక్ష్యం.