సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజుకో తరహా మోసాలతో సామాన్యులనే కాదు.. బాగా చదువుకున్న వారిని ఉన్నతస్థానంలో ఉన్నవారిని సైతం ఈజీగా మోసం చేస్తున్నారు. తాజాగా.. ఏపీకి చెందిన ఓ ఎమ్మెల్యే సైబర్ మోసం బారినపడ్డారు. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సైబర్ మాయాగాళ్ల వలలో చిక్కకుని భారీగా నష్టపోయారు. ఒకే ఒక్క క్లిక్‌తో ఆయన బ్యాంక్ ఖాతా మెుత్తం ఖాళీ అయిపోయింది.వివరాల్లోకి వెళితే.. ఆర్టీఏ ట్రాఫిక్ చలానా పేరుతో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మొబైల్‌కు ఓ సందేశం వచ్చింది. అందులో ఆయన వాహనానికి సంబంధించి ట్రాఫిక్ చలానా పెండింగ్‌లో ఉందని వెంటనే చెల్లించాలని కోరుతూ ఓ లింక్ పంపారు. అది నిజమైన చలానా అని గుడ్డిగా నమ్మిన ఎమ్మెల్యే.. పెండింగ్ చలాన్లు క్లియర్ చేసేందుకు ఆ మెసేజ్‌లో ఉన్న లింక్‌ను క్లిక్ చేశారు. దీంతో మాల్వేర్ ఉన్న యాప్ మెుబైల్‌ఫోన్‌లో ఎమ్మెల్యేకు తెలియకుండానే డౌన్‌లోడ్‌ అయింది. లింక్ ఓపెన్ చేసిన కాసేపటికే జంగారెడ్డిగూడెంలోని ఇండస్ ఇండ్ బ్యాంక్ బ్రాంచ్‌లో ఉన్న ఆయన ఖాతా నుంచి ఏకంగా రూ. 12 లక్షలు ఖాళీ అయ్యాయి. బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు విత్ డ్రా అయినట్లు మెసేజ్ రావటంతో ఎమ్మెల్యే బాలరాజు షాక్‌కు గురయ్యాడు. తన ఫోన్‌ను సైబర్ నేరగాళ్లు కంట్రోల్‌లో తీసుకున్నారని భావించి వెంటనే అలర్ట్ అయ్యారు. జీలుగుమిల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డబ్బులు జమ అయిన అకౌంట్ ఆధారంగా సైబర్ నేరగాళ్లను పట్టుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఐపీ అడ్రస్ ట్రాకింగ్, యాప్ డేటా విశ్లేషణ వంటి సాంకేతిక పద్ధతులను ఉపయోగించి నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు పలు సూచనలు జారీ చేశారు చేశారు. ట్రాఫిక్ పెండింగ్ చలాన్లు, గిఫ్ట్ వోచర్లు, కేవైసీ అప్‌డేట్ పేరుతో వచ్చే లింక్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారిక వెబ్‌సైట్లు మాత్రమే చూడాలని అలాంటి ఫేక్ వెబ్‌సైట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయవద్దని అంటున్నారు. ట్రాఫిక్ చలాన్లు క్లియర్ చేయాలనుకుంటే ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ లేదా అధికారిక యాప్స్ మాత్రమే వినియోగించాలని సూచిస్తున్నారు. ఒకవేళ మోసపోతే తక్షణమే 1930 నంబర్‌కు కాల్ చేయాలని లేదా లో ఫిర్యాదు చేయాలని ప్రజలకు పోలీసులు సూచిస్తున్నారు.