తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే.రామకృష్ణా రావు పదవీ కాలాన్ని పొడిగించారు. సీఎస్ రామకృష్ణారావు పదవీ కాలం పొడిగించాలని.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి కేంద్ర హోం శాఖ పరిధిలోని పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగం (డీఓపీటీ) ఆమోద ముద్ర వేసింది. ఈ నేపథ్యంలోనే మరో 3 నెలల పాటు పొడిగిస్తూ.. తాజాగా ఉత్తర్వులు వెలువరించింది. సీఎస్ రామకృష్ణారావు పదవీ కాలం గతంలోనే పూర్తి కాగా.. డీఓపీటీ ఒకసారి పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు మరోసారి పూర్తి కావడంతో రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తితో మరోసారి పొడిగించింది.2025 ఏప్రిల్‌ 30వ తేదీన తెలంగాణ సీఎస్‌గా రామకృష్ణారావుకు బాధ్యతలు అప్పగించారు. అయితే అదే ఏడాది ఆగస్టు నెలలో రామకృష్ణారావు పదవీ కాలం ముగిసింది. దీంతో ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉండగా.. అప్పుడే 7 నెలల పాటు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు మరోసారి 3 నెలల పాటు పొడిగించడంతో మొత్తంగా 10 నెలల పాటు పదవీ కాలాన్ని పొడగించినట్లయింది. దీంతో ఈ ఏడాది జూన్ నెలాఖరు వరకు తెలంగాణ సీఎస్‌ పదవిలో రామకృష్ణారావు కొనసాగనున్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా సమాచారం అందింది. రామకృష్ణారావు పనితీరు పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంతృప్తి చెందింది. రాష్ట్రంలో ప్రభుత్వ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో సీఎస్ రామకృష్ణారావు సఫలం అయ్యారు. అధికార యంత్రాగాన్ని గాడిలో పెట్టడంతోపాటు.. తోటి సీనియర్ ఐఏఎస్‌ అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ పనిచేస్తుండటం.. గత ప్రభుత్వం తీసుకున్న రుణాలను షెడ్యూల్ చేయించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈనెల 31వ తేదీతో రామకృష్ణారావు పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో మరోసారి పొడగించాలని రాష్ట్ర ప్రభుత్వం డీవోపీటీకి లేఖ రాయగా.. కేంద్రం నుంచి సానుకూల నిర్ణయం వచ్చింది.