ఏప్రిల్ 1 నుంచి కోడి గుడ్లపై ఎక్స్‌‌పైరీ డేట్ తప్పనిసరి.. యూపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

Wait 5 sec.

ఆహార భద్రతపై ఉత్తర్ ప్రదేశ్ కీలక నిర్ణయం తీసుకుంది. కోడిగుడ్ల సరఫరాలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సరికొత్త నిబంధనలు అమలు చేయనుంది. గుడ్లపై ఎక్స్ పైరీ డేట్ తప్పనిసరి చేసింది. పాడైపోయిన, కుళ్లిన కోడిగుడ్ల సరఫరాను అరికట్టి, వినియోగదారులకు తాజావి అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు యూపీ ప్రభుత్వం పేర్కొంది. ఏప్రిల్ 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ప్రభుత్వం మార్గదర్శకాలను పాటించని షాపులు, కోడిగుడ్ల వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించారు. పౌల్ట్రీలు, ఉత్పత్తిదారులు, సరఫరాదారులు, రిటైల్ దుకాణాలు ఈ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.కుళ్లిన గుడ్ల సరఫరా పెరుగుతుండటంతో ఆందోళనలు వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున ప్రజల నుంచి ఫిర్యాదులు అందాయి. దీంతో యోగి సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. ఎక్స్‌పైరీ డేట్ లేకుండా గుడ్లు అమ్మితే కఠిన చర్యలు తప్పవని, నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు, లైసెన్స్ రద్దు వరకు చర్యలు ఉంటాయని సీఎం హెచ్చరించారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలను కఠినంగా నిర్వహించాలని ఆయన ఆదేశించారు. ఉత్తర్ ప్రదేశ్‌లో కోడిగుడ్ల నిల్వ చేసేందుకు ఆగ్రా, ఝాన్సీ ప్రాంతాల్లో మాత్రమే కోల్డ్ స్టోరేజీలు ఉన్నాయి. కూరగాయలతో కలిపి గుడ్లను నిల్వ కుదరదు కాబట్టి ప్రత్యేకమైన స్టోరేజీలు అవసరం. దీనికోసం ప్రభుత్వం మౌలిక సౌకర్యాలను పెంచే ఆలోచనలో ఉంది. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే సరుకుపై ప్రత్యేక నిఘా ఉంటుంది. కాగా, గుడ్లపై ప్రింటింగ్‌కు అయ్యే ఖర్చు చాలా తక్కువ. ఒక్కోదానికి 3 నుంచి 4 పైసలు మాత్రమే ఖర్చవుతుందని యూపీ అధికారులు తెలిపారు. ఈ చిన్నపాటి ఖర్చు వల్ల గుడ్ల ధరలు పెరిగే అవకాశం ఉండదని, ఇప్పటికే పౌల్ట్రీల్లో తేదీలను ముద్రించే పనిని ప్రారంభించాయని చెప్పారు.FDA ప్రకారం గుడ్లు పెట్టిన తేదీ నుంచి 28 రోజుల వరకు వినియోగానికి సురక్షితమైనవిగా పరిగణిస్తారు. ఈ కాలపరిమితి దాటిన తర్వాత విక్రయించే ఏ గుడ్డనైనా ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తారు. గుడ్లను విడిగా విక్రయించినా లేదా ప్యాక్ చేసిన ట్రేలలో విక్రయించినా, ఈ నిబంధన తప్పక వర్తిస్తుంది. FDA అధికారులను ఉటంకిస్తూ.. గుడ్ల తేదీ వివరాలను కేవలం బయటి కార్టన్‌లు లేదా ప్యాకేజింగ్‌పై మాత్రమే కాకుండా గుడ్డుపైనే ముద్రించడం తప్పనిసరి.