నా భార్య చనిపోయింది.. 45 ఏళ్ల మహిళ కావాలి.. సోషల్ మీడియాలో తాతయ్య రిక్వెస్ట్..

Wait 5 sec.

దాంపత్యమంటే.. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, నమ్మకం, ప్రేమ.. అంతకుమించి పరస్పర అవగాహనతో కూడిన ఓ బంధం. ఏడు అడుగులతో మొదలైన ఈ బంధం.. ఏడు జన్మలూ తోడుండాలని దంపతులు కోరుకుంటూ ఉంటారు. అయితే కాలం కొన్ని జంటలను అనుకోకుండా విడదీస్తూ ఉంటుంది.. ఒంటరి పక్షులను చేస్తుంది.. ఇన్నేళ్లు తనతో కలిసి నడిచిన తోడు కరువై.. ఒంటరి ప్రయాణం సాగించాలంటే ఎవరికైనా ఇబ్బందే.. మరీ ముఖ్యంగా వయసు మళ్లిన వారికైతే మరింత కష్టం. జీవిత చరమాంకంలో వారికి కావాల్సిందే తోడు. ఒకరికి ఒకరు తోడూనీడలా ఉంటూ.. ప్రయాణానికి మంచి ముగింపు ఇవ్వాలని అందరూ కోరుకుంటారు. అలాంటి తోడు కరువైన ఓ వ్యక్తి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.బాపట్ల జిల్లా చీరాలకు చెందిన అనే వృద్ధుడు సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. చీరాల సమీపంలోని స్వర్ణ గ్రామానికి చెందిన నారాయణ భార్య ఐదేళ్ల కిందట కాలం చేశారు. నారాయణకు ఇద్దరు కొడుకులు కాగా.. వారి బతుకులు వారు బతుకుతున్నారు. జీవిత చరమాంకంలో భార్య దూరమై ఇబ్బందులు పడుతున్న నారాయణ.. తన సమస్యకు సోషల్ మీడియాలో పరిష్కారం వెతుకుతున్నారు. తన భార్య చనిపోయిందని.. 45 నుంచి 50 ఏళ్లలోపువారు ఎవరైనా తనకు భార్యగా ఉంటూ, ఇంటి పనులు, వంటపనులు చేసి పెడితే.. వారి బాగోగులు చూసుకుంటానంటూ నారాయణ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు. ఇష్టం ఉండేవాళ్లు తనను సంప్రదించాలని ఫోన్ నంబర్ కూడా పంచుకున్నారు. ఇందుకోసం సోషల్ మీడియాలో అకౌంట్ క్రియేట్ చేయటం విశేషం."నా పేరు నీరుకట్ల నారాయణ. మాది . చీరాల దగ్గర ఉంది. నా భార్య చనిపోయి ఐదేళ్లు అవుతోంది. నాకు అన్నం వండిపెట్టడానికి.. భార్యగా ఇంట్లో తోడూనీడగా ఉండేవాళ్లు కావాలి. 45- 50 సంవత్సరాల వాళ్లు కావాలి. అలాంటి వాళ్లు వచ్చి నా వద్ద ఉంటే వారికి సాయం చేస్తా. తిండికి, గుడ్డకూ లోటు లేకుండా చూస్తా. నా ఇద్దరు కొడుకులు దూరంగా ఉన్నారు. ఇంకా ఏవైనా అనుమానాలు ఉంటే నాకు ఫోన్ చేస్తే చెప్తా. నాకు తాగుడు, అల్లరిగా తిరిగే దురలవాట్లు లేవు. ఇష్టం ఉన్నవారు ఎవరైనా నాకు ఫోన్ చేయండి. " అంటూ నారాయణ చేసిన వీడియో పోస్టు వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోపై నెటిజన్లు పలు కామెంట్లు చేస్తున్నారు. తాతగారు అడిగిన విధానం బాగుందని.. భార్య చనిపోయి వృద్ధాప్యంలో ఒంటరిగా జీవించడం నరకమని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. తనకు తోడూ నీడగా ఉండేందుకు సోషల్ మీడియాను ఎంచుకోవటాన్ని అభినందిస్తున్నారు. వృద్ధ్యాప్యంలో భాగస్వామి దూరమై.. ఒంటరితనంతో ఇబ్బంది పడేవారు చాలా మంది ఉంటారని.. సంఘం ఏమనుకుంటుందో అనే భయంతో కాలం వెళ్లదీస్తుంటారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. అలాంటి వారికి తాతయ్య స్ఫూర్తిగా నిలిచారని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.