"మీ ప్రేమను మరువలేం": కాశ్మీరీల బంగారం, డబ్బుల సాయానికి ఇరాన్ కృతజ్ఞతలు

Wait 5 sec.

: పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధం వల్ల ఇరాన్‌లోని సామాన్య ప్రజల జీవితాలు అతలాకుతలం అవుతున్నాయి. ఇజ్రాయెల్ దాడుల వల్ల ఆర్థికంగా, సామాజికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇరాన్ ప్రజల కోసం.. జమ్మూ కాశ్మీర్ ప్రజలు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. సరిహద్దులకు అతీతంగా మానవత్వాన్ని చాటుతూ.. తమ వద్ద ఉన్న కొద్దిపాటి సంపాదనను, విలువైన వస్తువులను ఇరాన్ సహాయార్థం విరాళంగా అందజేశారు. ఇలాంటి సమయంలో తమకు సాయం చేయడంతో.. కాశ్మీరీ ప్రజలకు ఇరాన్ కృతజ్ఞతలు తెలిపింది. ఇంటింటికీ తిరిగి విరాళాల సేకరణఈద్-ఉల్-ఫితర్ వేడుకల అనంతరం కాశ్మీర్‌లోని షియా ముస్లింలు అధికంగా ఉన్న బుద్గాం, బారాముల్లా ప్రాంతాల్లో స్వచ్ఛందంగా విరాళాల సేకరణ ప్రారంభించారు. వాలంటీర్లు ప్రతి ఇంటికీ తిరిగి విరాళాలు సేకరించారు. అయితే అక్కడి ప్రజలు విరాళంగా కేవలం డబ్బును మాత్రమే ఇవ్వకుండా బంగారు, వెండి ఆభరణాలు, రాగి వస్తువులను కూడా అందజేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు తమ జీవనాధారమైన పశువులను కూడా విరాళంగా ఇచ్చి తమ ఉదారతను చాటుకున్నారు.ఈ విరాళాల సేకరణలో కొన్ని హృదయవిదారకమైన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. కాశ్మీర్‌కు చెందిన ఒక వృద్ధురాలు.. తన భర్త చనిపోయిన 28 ఏళ్ల నుంచి గుర్తుగా దాచుకున్న ఒక బంగారు ఆభరణాన్ని ఇరాన్ ప్రజల కోసం ఇచ్చేసింది. చిన్నారులు కూడా తమ 'ఈదీ' (పండుగ కానుకగా వచ్చిన డబ్బులు), తమ కిడ్డీ బ్యాంకుల్లో దాచుకున్న పొదుపు మొత్తాన్ని ఇరాన్ ప్రజల కోసం అందజేశారు. ప్రజాప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు. బుద్గాం ఎమ్మెల్యే ముంతాజిర్ మెహదీ తన ఒక నెల జీతాన్ని విరాళంగా ప్రకటించారు.కృతజ్ఞతలు తెలిపిన ఇరాన్ రాయబార కార్యాలయంభారత్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం ఈ విరాళాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ భావోద్వేగంగా స్పందించింది. "కృతజ్ఞతలతో నిండిన హృదయంతో మేము కాశ్మీర్ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ క్లిష్ట సమయంలో ఇరాన్ ప్రజలకు అండగా నిలిచిన మీ ప్రేమను, ఉదారతను మేము ఎన్నటికీ మరువలేం. ధన్యవాదాలు భారత్" అని ఎక్స్ వేదికగా పేర్కొంది.శ్రీనగర్‌కు చెందిన ఐజాజ్ అహ్మద్ అనే స్థానికుడు మాట్లాడుతూ.. ఇరాన్‌పై ఇజ్రాయెల్ అక్రమంగా యుద్ధాన్ని చేస్తోందని, దీనివల్ల అక్కడి ప్రజలు తీవ్ర నష్టాన్ని అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాగరిక సమాజం బాధితులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ సేకరించిన విరాళాలను ఇరాన్ రాయబార కార్యాలయం ద్వారా అధికారికంగా ఇరాన్‌లోని బాధితులకు చేరవేయనున్నట్లు తెలిపారు.