వయస్సు కంటే రికార్డులే చాలా పెద్దవి. కేవలం 14 ఏళ్ల వయస్సులో 18 ఏళ్ల ఐపీఎల్ రికార్డులన్నీ బద్దలుకొట్టేశాడు. అండర్ 19లోనూ సెంచరీల మోత మోగించి ప్రపంచ క్రికెట్ వార్నింగ్ బెల్ అందించాడు. అలాంటి వైభవ్ సూర్యవంశీ‌పై ఆర్సీబీ ప్లేయర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. గొప్ప ప్లేయర్ అయినా ప్రొఫెషనల్ కాదని, డిసిప్లేన్ లేదంటూ చెప్పడం ఆసక్తికరంగా మారింది. సౌతాఫ్రికా దిగ్గజ బ్యాటర్ తన యూట్యూబ్ ఛానల్‌లో ఆర్సీబీ స్టార్ ప్లేయర్ జితేశ్ శర్మతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలో వైభవ్ సూర్యవంశీ పేరు చర్చకు వచ్చింది. ఆ సమయంలో వైభవ్ ఆఫ్ ది ఫీల్డ్ ఎలా ఉంటాడో నవ్వుతూ చెప్పేశాడు. "వైభవ్ గొప్ప ప్లేయర్. కానీ ప్రొఫెషనల్ కాదు.. ముఖ్యంగా ఆఫ్ ది ఫీల్డ్. రాత్రిళ్లు ఐస్‌క్రీమ్ తినొద్దని చెబుతున్నా అస్సలు వినడు" అంటూ జితేశ్ శర్మ అన్నాడు. వైభవ్ ఇంకా టీనేజ్‌లోనే ఉన్నాడని.. పూర్తి స్థాయి ప్రొఫెషనల్‌గా మారలేదన్న ఉద్దేశంలో జితేశ్ శర్మ ఈ వ్యాఖ్యలు చేశాడు. అంతకు ముందు డివిలియర్స్ మాత్రం వైభవ్ సూర్యవంశీని తెగ పొగిడేశాడు. వయస్సుకు మించిన ఆటతీరుతో అబ్బురపరుస్తున్నాడంటూ ఏబీడీ కొనియాడాడు. గేమ్ ప్లాన్‌కు తగ్గట్టుగానే బ్యాటింగ్ స్టయిల్ ఉంటుందని చెప్పాడు. "అతను తన గేమ్ ప్లాన్‌కు తగ్గట్టే ఉంటాడు. తన స్టయిల్ అస్సలు మార్చుకోడు, వయస్సుకు మించిన మెచ్యూరిటీ అతనిలో ఉంది" అంటూ వైభవ్ ఆటతీరును డివిలియర్స్ ప్రశంసించాడు. గత సీజన్‌లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన వైభవ సూర్యవంశీ ఐపీఎల్ సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీతో రికార్డు సృష్టించాడు. అత్యంత చిన్న వయస్సులోనే సెంచరీ చేసిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. కేవలం ఏడు మ్యాచ్‌లే ఆడిన సూర్యవంశీ ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీతో 252 పరుగులు నమోదు చేశాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న ఈ బుల్లి డైనమైట్ ఈ ఐపీఎల్ 2026లో ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడతాడో వేచి చూడాల్సిందే!