రూ.7,00,000 కోట్లు లాభం.. 3 రోజూ సూచీల భారీ ర్యాలీ.. ఇన్ఫీ, టీసీఎస్ సహా ఐటీ స్టాక్స్ లాభాలు

Wait 5 sec.

Stock Market: ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం కొనసాగుతున్నప్పటికీ భారతీయ స్టాక్ మార్కెట్లు వరుస లాభాల్లో దూసుకెళ్తున్నాయి. మార్చి 18వ తేదీ బుధవారం రోజు ట్రేడింగ్‌లో ఒక దశలో 900 పాయింట్లకు పైగా పెరిగింది. నిఫ్టీ 50 మళ్లీ 23,800 మార్క్ దాటింది. ముడి చమురు ధరలు దిగిరావడం, మదుపరుల సెంటిమెంట్ బలోపేతం కావడంతో సూచీలు రాణించినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి ఐటీ సెక్టార్ కంపెనీల స్టాక్స్ ఈరోజు రాణించడం సూచీలు భారీ లాభాల్లో ముగిసేందుకు కారణమైనట్లు తెలిపారు. మరి ఆ వివరాలు తెలుసుకుందాం. సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు ఈరోజు భారీ లాభాల్లోకి రావడంతో వరుసగా మూడు రోజుల్లో ఇన్వెస్టర్ల సంపద భారీగా పెరిగింది. బీఎస్ఈలో నమోదిత కంపెనీల మార్కెట్ విలువ రూ.433 లక్షల కోట్ల నుంచి రూ.440 లక్షల కోట్లకు చేరింది. అంటే ఇన్వెస్టర్ల సంపదగా భావించే కంపెనీల విలువ రూ.7 లక్షల కోట్లు పెరిగింది. ఐటీ స్టాక్స్ అయిన ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టీసీఎస్, టెక్ మహీంద్రాలు ఈరోజు టాప్ గెయినర్స్ లిస్ట్‌‍లో ఉన్నాయి. ఈ స్టాక్స్ 3-4 శాతం మేర లాభపడ్డాయి. ఇక జొమాటో మాతృ సంస్థ ఎటర్నల్, మహీంద్రా అండ్ మహీంద్రా, అదానీ పోర్ట్స్, ఎల్ అండ్ టీ సైతం 3 శాతం వరకు పెరిగాయి. కానీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హిందుస్థాన్ యూనిలివర్, ఎన్‌టీపీసీ, సన్ ఫార్మా వంటివి నష్టాలను మూటగట్టుకున్నాయి. మంచి లాభాల్లో ట్రేడింగ్ మొదలు పెట్టింది. ఒక దశలో 900 పాయింట్లకు పైగా లాభపడి 77 వేల మార్క్ తాకింది. ఆ తర్వాత కాస్త వెనక్కి తగ్గింది. చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 633 పాయింట్ల లాభంతో 76,704 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 50 ఇండెక్స్ సైతం మంచి లాభాలతో 23,632 పాయింట్ల వద్ద ప్రారంభమై ఒక దశలో 23,862 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది. చివరకు 196 పాయింట్ల లాభంతో 23,777 పాయింట్ల వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు కాస్త వెనక్కి తగ్గాయి. హార్ముజ్ జల సంధి పై ఆంక్షలు కొనసాగుతున్న క్రమంలో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ కు క్రితం రోజు 110 డాలర్ల పైకి చేరిన సంగతి తెలిసిందే. ఈరోజు అది 103 డాలర్లకు దిగివచ్చింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడ్ ఆయిల్ ధర 94.73 డాలర్లు పలుకుతోంది. ప్రస్తుతం తగ్గినప్పటికీ ఇంకా 100 డాలర్ల పైనే కొనసాగుతుండడం కొంత ఆందోళన కలిగించే విషయమే.