: అంతర్జాతీయంగా రాజకీయ- భౌగోళిక ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ.. ఇరాన్- ఇజ్రాయెల్- అమెరికా మధ్య తీవ్ర యుద్ధం జరుగుతున్నప్పటికీ.. ఆశ్చర్యకరంగా బంగారం, వెండి ధరలు భారీ స్థాయిలో పతనం అవుతున్నాయి. యుద్ధం ఫిబ్రవరి 28న మొదలవగా.. అప్పటి నుంచి దాదాపు ప్రతి రోజూ గోల్డ్ రేటు దిగొస్తూనే ఉంది. ఈ మధ్యలో కేవలం 3-4 రోజులు అది కూడా స్వల్పంగా మాత్రమే పెరిగింది. మిగతా రోజుల్లో భారీగా దిగొచ్చింది. . సాధారణంగా ఇలాంటి యుద్ధ సమయాల్లో.. ఆర్థిక అనిశ్చితి వేళ బంగారం ధర ఇంకా పెరగాల్సి ఉంటుంది.. ఇది సురక్షిత పెట్టుబడి సాధనంగా మారి పెట్టుబడులు పెరగాలి.. కానీ ప్రస్తుతం జరగకుండా ధర రోజురోజుకూ పతనం అవుతూనే ఉండటం గమనార్హం. ఇక్కడ యుద్ధం ప్రభావం.. స్టాక్ మార్కెట్లు, రూపాయి, క్రూడాయిల్, బిట్‌కాయిన్ ఇలా అన్నింటిపైనా పడింది. స్టాక్ మార్కెట్లు యుద్ధం మొదలైనప్పటి నుంచి భారీగా పడిపోయాయి. ఈ మార్చి నెల ఇన్వెస్టర్లకు పీడకలను మిగిల్చిందనే చెప్పొచ్చు. మార్చి 23న కూడా సెన్సెక్స్ వార్త రాసే సమయంలో ఉదయం 10.30 గంటలకు 1500 పాయింట్లకుపైగా నష్టంలో ఉంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 94 మార్కుకు చేరువై ఆల్ టైమ్ లో స్థాయికి పడిపోయింది. బ్రెంట్ క్రూడాయిల్ ధర ఇవాళ మళ్లీ పెరిగి బ్యారెల్‌కు 108 డాలర్ల స్థాయిలో ఉంది. ఇక బిట్‌కాయిన్ గతేడాది అక్టోబరులో 1,26,000 డాలర్ల వద్ద ఆల్ టైమ్ హైని నమోదు చేయగా ప్రస్తుతం 68 వేల డాలర్ల వద్దే ఉంది. 40 ఏళ్ల రికార్డ్ బ్రేక్..ఇలా అన్నింటిపైనా తీవ్ర ప్రభావం ఉన్నా.. బంగారం ధర మాత్రం పతనం అవుతోంది. గత వారం బంగారం ధర ఏకంగా 11 శాతం పడిపోగా.. 40 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టింది. ఒక వారంలో గోల్డ్ రేటు ఈ స్థాయిలో పడిపోవడం 40 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి అన్నమాట. దీన్ని బట్టి పతనం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మార్చి 23న మళ్లీ 24 క్యారెట్ల పసిడి ధర రూ. 5950 మేర తగ్గి 10 గ్రాములకు రూ. 1,40,020 కు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 5450 పతనంతో తులం రూ. 1,28,350 వద్ద ఉంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు 4400 డాలర్ల మార్కు దిగువకు పడిపోయింది. యుద్ధానికి ముందు 5400 డాలర్ల స్థాయిలో ఉండేది. ఇక ఈ యుద్ధం మార్చి 28న ప్రారంభం కాగా.. మార్చి 1న బంగారం ధర 22 క్యారెట్లకు రూ. 1,45,970; 24 క్యారెట్లకు రూ. 1,73,090 వద్ద ఉన్నాయి. అక్కడి నుంచి చూసినా ఇదే సమయంలో ఆల్ టైమ్ హై నుంచి చూస్తే గనుక.. జనవరి 29న 22 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ. 1,63,950 వద్ద ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1,78,850 వద్ద ఉండేవి. ఇవే ఇప్పటివరకు జీవన కాల గరిష్ఠ స్థాయి. అక్కడి నుంచి చూస్తే 24 క్యారెట్ల బంగారం ధర రూ. 38,830 తగ్గగా.. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 35600 తగ్గింది. అసలు బంగారం ధర ఎందుకు తగ్గుతుంది?యుద్ధం జరుగుతున్నా బంగారం ధర తగ్గేందుకు ప్రధాన కారణాల్లో క్రూడాయిల్ ధరలు పెరగడం, పుంజుకోవడం వంటివి ఉన్నాయి. . ఇది యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించకుండా ఆపేలా చేస్తుంది. గరిష్ఠ స్థాయిల్లో ఉంటే.. యూఎస్ డాలర్, ట్రెజరీ బాండ్ ఈల్డ్స్ ఆకర్షణీయంగా మారి.. బంగారం ఆకర్షణ కోల్పోతుంది. ప్రస్తుతం అదే జరుగుతోంది. ఈ కారణంతోనే బంగారం నుంచి బయటకు వచ్చేస్తున్నారు ఇన్వెస్టర్లు. ఇంకా ప్రస్తుత అనిశ్చితి వేళ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు.. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్లలో డబ్బును కోల్పోతున్నారు. ఇదే సమయంలో వారికి డబ్బులు కావాలంటే.. గతేడాది ఇప్పటికే బంగారం ధర భారీగా పెరిగింది కాబట్టి.. పసిడిలో అమ్మకాలు జరపడం ద్వారా ఆ లాభాల్ని సొమ్ము చేసుకుంటున్నారు. మరోవైపు.. తమ పెట్టుబడుల్ని ఆయిల్ మార్కెట్‌వైపు మళ్లిస్తుండటం కూడా మరో కారణం. ఇంకా తగ్గుతుందా? నిపుణుల సూచనలేంటి?కొంత కాలంగా బంగారం ధరల్ని యూఎస్ ఫెడరల్ రిజర్వ్.. యూఎస్ డాలర్.. క్రూడాయిల్.. ఇన్వెస్టర్ల ధోరణి.. ఇవే ప్రభావితం చేస్తున్నాయి. ఇవే ధరల్ని నిర్దేశిస్తున్నాయని చెప్పొచ్చు. యుద్ధం ఇంకా తీవ్రమైతే.. సమీప భవిష్యత్తులో మరింత పతనం కావొచ్చనే చెబుతున్నారు నిపుణులు. ఇంకా ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు.. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల విషయంలో ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. కొంత కాలంగా తగ్గించేందుకే మొగ్గుచూపగా.. మళ్లీ పెంచాల్సి వస్తే మాత్రం.. బంగారం ధరలు ఇంకా పతనం కావొచ్చని అంటున్నారు. వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్ట్స్ ప్రకారం.. బంగారం ధర ఇటీవల కరెక్షన్‌కు గురైన క్రమంలో.. ధరలు భారీగా దిగొచ్చిన నేపథ్యంలో.. కనిష్ఠ స్థాయిల వద్ద లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకు కొనుగోలు చేసేందుకు మంచి సమయం అంట. ఈ మేరకు ఫిలిప్ నోవాస్ సీనియర్ మార్కెట్ అనలిస్ట్ ప్రియాంక సచ్‌దేవా చెప్పినట్లు ఉటంకించింది.