పాడి చెప్పాలి. చాలా ఈజీగా పాడి పశువుల చూడిని నిర్ధారించొచ్చు. పేడ నమూనాలతో సాధారణంగా మనుషుల్లో ప్రెగ్నెన్సీని నిర్థారించినట్లే పశువుల్లోనూ చూడిని నిర్ధారించే కిట్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. పశువులలో గర్భధారణను అత్యంత సులువుగా, ముందస్తుగా గుర్తించేలా ప్రక్యేక కిట్‌ను హైదరాబాద్‌లోని సీసీఎంబీకి చెందిన అంతరించిపోతున్న జాతుల పరిరక్షణ ప్రయోగశాల (లాకోన్స్‌) శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ సంస్థ అభివృద్ధి చేసిన సరికొత్త పరికరానికి తాజాగా అమెరికా పేటెంట్ లభించింది. 'Non-Invasive and Early Pregnancy Detection Kit for Cattle and Buffaloes' పేరుతో రూపొందించిన ఈ పరికరం డెయిరీ రైతులకు ఒక వరంలా మారనుంది.ప్రపంచంలోనే వంటి దేశాల్లో కోట్లాది మంది గ్రామీణ రైతులు పాడి పరిశ్రమపైనే ఆధారపడి జీవిస్తున్నారు. సాధారణంగా పశువులు గర్భం దాల్చాయో లేదో తెలుసుకోవాలంటే వెటర్నరీ డాక్టర్ చేతిని లోపలికి పెట్టి ట్రాన్స్‌రెక్టల్‌ పాల్పేషన్‌ వంటి టెస్టులు చేస్తారు. బ్లడ్ టెస్టుల ద్వారానూ నిర్ధారిస్తారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పద్ధతుల ద్వారా గర్భం దాల్చిన 3 నుంచి 4 నెలల తర్వాతే ఫలితం తెలుస్తుంది. కానీ, ఈ కొత్త కిట్ సాయంతో పశువైద్యుడి అవసరం లేకుండా కేవలం 6 నుంచి 8 వారాల్లోనే గర్భధారణను ఖచ్చితంగా గుర్తించవచ్చు. పశువుకు ఎలాంటి నొప్పి లేకుండా చూడిని గుర్తించేలా కిట్‌ను లాకోన్స్‌ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ ఆవిష్కరణ గురించి లాకోన్స్ శాస్త్రవేత్త గోవిందస్వామి ఉమాపతి మాట్లాడుతూ.. పశువుల పేడ నమూనాలలో ఒక వినూత్నమైన 'బయోమార్కర్'ను గుర్తించినట్లు తెలిపారు. ఈ మార్కర్ ఆధారంగానే లాటరల్ ఫ్లో డివైజ్‌ను అభివృద్ధి చేసినట్లు చెప్పారు. ఈ విధానంలో పశువులకు ఎటువంటి నొప్పి కలగదని అన్నారు. మొదట పశువుల పేడను ప్రత్యేక కెమికల్ ద్రావణంతో కలుపుతామని... ఆ ద్రవం చుక్కలను టెస్ట్‌ కిట్‌పై ఉన్న శాంపిల్‌ ప్యాడ్‌పై వేస్తామన్నారు. కొద్ది నిమిషాల తర్వాత కిట్‌పై ఉన్న కంట్రోల్‌ జోన్‌ వద్ద రెండు గీతలు వస్తే పశువు చూడితో ఉన్నట్లని.. ఒక గీత మాత్రమే వస్తే గర్భం లేనట్లు నిర్ధారించవచ్చునని చెప్పారు. తక్కువ ధర కలిగిన పరికరం వల్ల పశువుల పునరుత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని.. రెండు ఈతల మధ్య కాలాన్ని తగ్గించడం ద్వారా పాల ఉత్పత్తిని పెంచవచ్చునని గోవిందస్వామి ఉమాపతి చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నకారు రైతులకు ఆర్థిక నష్టాలను తగ్గించి, మెరుగైన పశుపోషణకు ఈ కిట్ ఎంతగానో దోహదపడుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీన్ని వాణిజ్య స్థాయికి తీసుకెళ్లాల్సి ఉందని త్వరలోనే మార్కెట్‌లోకి అందుబాటులోకి వస్తుందని అన్నారు.