హైదరాబాద్‌ బిర్యానీ ఎంత ఫేమస్సో.. ఇరానీ చాయ్, వేడివేడి సమోసా అంతే ఫేమస్. నగరవాసులు గరం గరం చాయ్‌తో పాటు వేడి వేడి సమోసాలను అమితంగా ఇష్టపడతారు. అయితే మీరు ఎంతో ఇష్టంగా ఆరగించే ఆ సమోసాలు ఎక్కడ తయారవుతున్నాయి ? వాటిలో వాడే పదార్థాలు ఎంతవరకు సురక్షితం ? అని ఎప్పుడైనా ఆలోచించారా ? జియాగూడలో ఒక సమోసా తయారీ కేంద్రాన్ని చూస్తే మీరు అవాక్కవ్వడమే కాదు.. ఆ దృశ్యాలు చూస్తే 'యాక్.. తూ' అనకుండా ఉండలేరు. అపరిశుభ్రమైన వాతావరణం, కుళ్లిన పదార్థాలు, ప్రాణాలు తీసే కల్తీ నూనెతో తయారవుతున్న ఈ సమోసాల గుట్టును టాస్క్ ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. కుల్సుంపురా పోలీస్ స్టేషన్ పరిధిలోని అపరిశుభ్ర వాతావరణంలో సాగుతున్న ఒక భారీ సమోసా తయారీ యూనిట్‌పై హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్ (H-FAST), టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. అబ్దుల్ రషీద్ అనే వ్యక్తి గత కొంతకాలంగా ఈ కేంద్రాన్ని నిర్వహిస్తుండగా.. విచారణలో తెలిసిన విషయాలు అధికారులను సైతం విస్మయానికి గురిచేశాయి. ఈ యూనిట్‌కు ఎటువంటి FSSAI లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్, ఫైర్ సేఫ్టీ క్లియరెన్స్ లేదు. సమోసాల తయారీకి కుళ్లిన ఉడికించిన కోడిగుడ్లు, నాణ్యత లేని స్వీట్ కార్న్, నాసిరకం మైదా పిండిని వాడుతున్నట్లు గుర్తించారు. ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమైన రీతిలో పదే పదే మరిగించిన నూనెనే వాడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. దాంతో పాటు ఎటువంటి శుభ్రత లేకుండా సమోల మధ్యే నడుస్తూ అక్కడి పనివారు వాటిని తయారు చేయటాన్ని గుర్తించారు. ఈ దాడిలో రూ.5 లక్షల విలువైన కల్తీ ఆహార పదార్థాలు, యంత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వేల సంఖ్యలో తయారు చేసిన సమోసాలు, మైదా బస్తాలు, స్వీట్ కార్న్, తయారీకి ఉపయోగించే భారీ యంత్రాలు ఉన్నాయి. నిందితుడు అబ్దుల్ రషీద్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. సంబంధిత చట్టాల కింద కేసులు నమోదు చేశారు. ప్రజారోగ్యానికి హాని కలిగించే ఇటువంటి అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సిటీ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఆహార పదార్థాల నాణ్యత విషయంలో పౌరులు అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా కల్తీ జరుగుతున్నట్లు అనుమానం వస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని కోరారు.కాగా, నగరంలో కల్తీ ఆహారాన్ని అరికట్టేందుకు తెలంగాణ పోలీసులు ప్రత్యేకంగా హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్ (H-FAST)ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ టీమ్‌లో మొత్తం 28 మంది పోలీసులు ఉంటారు. వీరు కేవలం పోలీస్ విభాగానికి మాత్రమే పరిమితం కాకుండా.. ఆహార భద్రతా అధికారులు ఇతర నిపుణులతో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తారు. ఆహార భద్రతలో తేడాలు కనిపిస్తే 8712661212 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.