: చాలా మందికి పెట్టుబడులు పెట్టాలని ఉన్నప్పటికీ.. ఎప్పుడు ఎక్కడ పెట్టుబడి పెట్టాలనే దానిపై సరైన అవగాహన ఉండకపోవచ్చు. మనకు ఇన్వెస్ట్ చేసేందుకు చాలానే ఆప్షన్లు ఉంటాయి. వీటిల్లో బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు, పోస్టాఫీస్ స్కీమ్స్ వంటివి స్థిరమైన రిటర్న్స్ ఇస్తుంటాయి. రిస్క్ ఉండదు. అదే స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్లలో రిస్క్ ఉన్నప్పటికీ లాంగ్ రన్‌లో మంచి రాబడి వస్తుందని చెబుతుంటారు. స్టాక్ మార్కెట్లతో పోలిస్తే మ్యూచువల్ ఫండ్లలో వైవిధ్యత ఉంటుంది. రిటైర్మెంట్ ప్రయోజనాల కోసం.. లాంగ్ రన్‌లో పెద్ద మొత్తంలో సంపద కోసం చాలా మంది దీనికే మొగ్గుచూపుతుంటారు. అయితే ఇక్కడ మ్యూచువల్ ఫండ్లలో ఒక సరైన వ్యూహంతో వెళ్లాల్సి ఉంటుంది. . ఎంత ఎక్కువ కాలం పెట్టుబడులు కొనసాగిస్తే అంత పెద్ద మొత్తంలో రాబడి అందుకోవచ్చు. >> చాలా మంది చిన్న వయసులోనే పెట్టుబడులు ప్రారంభించడం ద్వారా దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో సంపాదించినవారు ఉన్నారు. కాంపౌండింగ్ ఎఫెక్ట్ దీర్ఘకాలం పెట్టుబడులు కొనసాగించిన వాటిపై ఎక్కువగా కనిపిస్తుంది. దీంతో సంపద ఊహించని రీతిలో పెరుగుతుందని చెప్పొచ్చు. కొందరు సంపాదించడం స్టార్ట్ చేసిన కొద్ది రోజుల్లోనే పెట్టుబడుల్ని ప్రారంభిస్తుంటారు. కొందరు మాత్రం.. కాస్త లేట్‌గా ఎక్కువ పెట్టుబడి పెట్టొచ్చులే అనుకుంటారు. మ్యూచువల్ ఫండ్లలో సిప్ పెట్టుబడులపై చాలా మందికి ఆసక్తి ఉంటుంది. సిప్ చిన్న మొత్తంలో చిన్న వయసులో ప్రారంభించిన దానికి.. కాస్త ఆలస్యంగా ఎక్కువ మొత్తం సిప్ పెట్టుబడి పెట్టిన దానికి చాలా తేడా ఉంటుంది. ఆలస్యంగా ఎక్కువ మొత్తం సిప్ పెట్టుబడి పెట్టిన దాని కంటే.. చిన్న వయసులో తక్కువ సిప్ పెట్టుబడి పెట్టిన దానికే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. ఇక్కడే కాంపౌండింగ్ మ్యాజిక్ కనిపిస్తుంది. ప్రముఖ ఛార్టర్డ్ అకౌంటెంట్ నితిన్ కౌశిక్ దీనిని అర్థమయ్యేలా ట్విట్టర్‌లో వివరించారు. ఎర్లీ స్టార్ట్ vs లేట్ స్టార్ట్ గురించి చెప్పుకొచ్చారు. దీని గురించి తెలుసుకుందాం. స్టార్టింగ్ ఎర్లీ అనేది గుడ్ హ్యాబిట్ మాత్రమే కాకుండా.. లాంగ్ రన్‌లో మల్టీ అడ్వాంటేజెస్ అందిస్తుందని వివరిస్తున్నారు. నితిన్ కౌశిక్ ప్రకారం.. ఇక్కడ కునాల్ అనే వ్యక్తి తనకు 26 ఏళ్ల వయసులో నెలకు రూ. 12 వేల చొప్పున సిప్‌ పెట్టుబడి పెడితే మరో 29 ఏళ్లలో అంటే 55 ఏళ్లు వచ్చే సరికి రూ. 3.68 కోట్లు కూడబెడతాడు. ఇక్కడ సగటున వార్షిక ప్రాతిపదికన 12 శాతం అంచనా రాబడితో ఈ లెక్కలు వేశారు. మ్యూచువల్ ఫండ్లలో ఈ మాత్రం సాధారణంగానే రిటర్న్స్ వస్తాయి. అదే వికాస్ అనే వ్యక్తి పదేళ్లు ఆలస్యంగా సిప్ పెట్టుబడి ప్రారంభించినా.. ఇక్కడ నెలకు అదనంగా రూ. 10 వేల చొప్పున మొత్తం రూ. 22 వేల సిప్ చేసినా.. 55 ఏళ్లు వచ్చే సరికి కూడబెట్టే మొత్తం రూ. 1.98 కోట్లే.ఇక్కడ కునాల్‌తో పోలిస్తే వికాస్ ప్రతి నెలా అదనంగా రూ. 10 వేలు ఇన్వెస్ట్ చేసినా.. మొత్తంగా రూ. 8.4 లక్షలు ఎక్కువ పెట్టుబడి పెట్టినా.. కునాల్ కూడబెట్టే దాని కంటే రూ. 1.7 కోట్లు తక్కువే సమకూరుస్తున్నాడు. అంటే పదేళ్లు ఆలస్యంగా పెట్టుబడి ప్రారంభించి.. ఎంత ఎక్కువ పెట్టుబడి పెట్టినా.. కోట్లల్లో కోల్పోతున్నాడని గమనించొచ్చు. అంటే ఆలస్యం చేసే ప్రతి క్షణం.. కాంపౌండింగ్ ప్రయోజనాన్ని కోల్పోతున్నట్లే అని ఆయన వివరిస్తున్నారు.గమనిక: మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు స్టాక్ మార్కెట్ రిస్క్‌కు లోబడి ఉంటాయి. ఇక్కడ పెట్టుబడి పెట్టే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. పైన ఇచ్చింది సమాచారం మాత్రమే.. పెట్టుబడికి సిఫార్సు కాదు.