నేడు అన్నదాతల ఖాతాల్లోకి డబ్బులు.. తొలి విడతలో ఎకరా వరకు, చెక్ చేసుకోండి

Wait 5 sec.

తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్. డబ్బులు ఖాతాల్లో జమ కానున్నాయి. యాసంగి సీజన్‌కు పంటల పెట్టుబడి కోసం రేవంత్ ప్రభుత్వం మొదటి విడతలో రూ.3,446.94 కోట్లను రైతు భరోసా కింద విడుదల చేసింది. 68,89,955 మంది రైతుల ఖాతాల్లో నేడు డబ్బులు జమ కానున్నాయి. సిద్దిపేట జిల్లా నర్మెటలో జరిగిన సభలో ఆదివారం (మార్చి 22) సీఎం రేవంత్‌ రెడ్డి బటన్‌ నొక్కి నిధుల విడుదల చేయగా.. ఆదివారం సెలవుదినం కావడంతో నేడు ఈ నిధులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. తొలి విడతలో ఎకరం వరకు భూమి ఉన్న రైతులను పరిగణనలోకి తీసుకొని 57,44,907.19 ఎకరాలకు ఈ సాయం విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వం కింద ఎకరాకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తుండగా.. ఈ డబ్బులను రెండు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. యాసంగి సీజన్‌లో భాగంగా ఎకరాకు రూ.6 వేల చొప్పున తాజాగా నిధులు విడుదల చేశారు. ఈ నిధుల్లో అత్యధికంగా నల్గొండ జిల్లాలో 5,22,313 మంది రైతులకు రూ.268.57 కోట్లు విడుదలైనట్లు అధికారులు తెలిపారు. అత్యల్పంగా మేడ్చల్‌ జిల్లాలో 24,935 మంది రైతులకు రూ.10.43 కోట్లు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఇవాళ ఉదయం బ్యాంకులు ఓపెన్ కాగానే రైతుల ఖాతాల్లో పంట పెట్టుబడి సాయం డబ్బులు జమ అవుతాయని చెప్పారు. ఆమేరకు బ్యాంకుల నుంచి రైతులకు మేసేజ్‌లు వస్తాయని వ్యవసాయ అధికారులు తెలిపారు. ఎకరం వరకు భూమి ఉండి, నిధులు జమ కాని వారు సంబంధిత వ్యవసాయాధికారిని సంప్రదించాలని సూచించారు. రైతుల కళ్లలో ఆనందం చూడాలన్నదే మా లక్ష్యం: రేవంత్తమ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నర్మెటలో జరిగిన సభలో మాట్లాడిన ఆయన.. ఆర్థిక సమస్యలున్నా రైతుభరోసా పంపిణీ చేస్తున్నామని చెప్పారు. పెద్దన్నగా వారికి అండగా నిలుస్తానని అన్నారు. ప్రస్తుత యాసంగి సీజన్‌కు మొదటి విడతగా రూ.3,600 కోట్లు పంపిణీ చేసే ప్రక్రియ ప్రారంభమైందని అన్నారు. మార్చి 23 నుంచి అన్నదాతల ఖాతాల్లో సొమ్ము జమవుతుందని వెల్లడించారు. మొత్తంగా 45 రోజుల వ్యవధిలో రూ.9 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు. గతంలో తొమ్మిది రోజుల్లోనే పంపిణీ చేశామని.. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో విడతల వారీగా ఇస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.