ఏపీ మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన మరో హామీని నెరవేర్చారు. ఏపీ ప్రభుత్వం ప్రముఖ సంఘ సంస్కర్త, శెట్టిబలిజ సంఘ వ్యవస్థాపకుడు దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించింది. ఇకపై ప్రతి ఏటా మార్చి 23న దొమ్మేటి జయంతి వేడుకల్ని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తారు. ఈ మేరకు అన్ని ప్రభుత్వ శాఖలను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.. నేడు రాష్ట్రవ్యాప్తంగా దొమ్మేటి జయంతి కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం అధికారిక కార్యక్రమంగా నిర్వహిస్తారు. దొమ్మేటి వెంకటరెడ్డి కోనసీమ ప్రాంతానికి చెందినవారు కాగా.. ఆయన గొప్ప సామాజిక సంస్కర్తగా గుర్తింపు పొందారు. శెట్టిబలిజ సమాజానికి విద్య, ఐక్యత, గౌరవాన్ని తీసుకొచ్చిన వ్యక్తిగా గుర్తింపు వచ్చింది. దొమ్మేటి శెట్టిబలిజ సంక్షేమ సంఘాన్ని స్థాపించారు.. ఆయన సమాజంలో విద్యకు ఎంత ప్రాముఖ్యం ఉంది వివరించారు, పెంచారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేయడం కోసం 19వ శతాబ్దం తొలినాళ్లలో కష్టపడ్డారు. అందుకే రాష్ట్ర పండుగగా వెంకటరెడ్డి జయంతిని గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత స్వాగతించారు.. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. యువగళం పాదయాత్ర సమయంలో దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని శెట్టి బలిజ సంఘాలు నారా లోకేష్‌ను కోరాయి. సానుకూలంగా స్పందించిన ఆయన ప్రభుత్వం అధికారంలోకి వస్తే హామీని నెరవేరుస్తామని ప్రకటించారు.. ఇప్పుడు ఉత్తర్వులు జారీ చేశారు. దొమ్మేటి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై మంత్రి వాసంశెట్టి సుభాష్‌ హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్, మంత్రి లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయం శెట్టి బలిజ సమాజానికి ఇది గర్వకారణమని ఆయా సంఘాలు తెలిపాయి.'గత ప్రభుత్వం శెట్టిబలిజ సామాజిక వర్గాన్ని బ్రాకెట్2లో పెట్టి మరో కులానికి ఉపకులంగా చూపిస్తూ జారీ చేసిన మెమోను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. శెట్టిబలిజ సామాజిక వర్గం యొక్క అస్థిత్వాన్ని, ఆత్మగౌరవాన్నీ గుర్తిస్తూ శెట్టి బలిజలను ప్రత్యేకంగా శెట్టి బలిజ సామాజిక వర్గంగానే గుర్తించి జీవోను తీసుకొచ్చారు. మమ్మల్ని, మా అస్థిత్వాన్నీ గౌరవించి, మళ్లీ తాజాగా మా కుల పితామహులు దొమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతిని ప్రతి ఏటా అధికారికంగా జరపాలని జీవోను జారీ చేసిన రాష్ఠ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , మంత్రి నారా లోకేష్, అందుకు కృషి చేసిన రాష్ఠ్ర శెట్టి బలిజ కార్పొరేషన్ ఛైర్మన్ కుడుపూడి సత్తిబాబు గారికి,కార్యవర్గానికీ ప్రత్యేక ధన్యవాదాలు'