మత్స్యకారుల పంట పండింది.. రెండు చేపలకు ధర రూ.లక్షా 94వేలు.. ఎందుకంత ప్రత్యేకం!

Wait 5 sec.

పశ్చిమగోదావరి జిల్లాలో మత్స్యకారుల పంట పండింది. చాలా అరుదుగా దొరికే గోల్డెన్‌ ఫిష్‌గా పిలిచే అరుదైన కచ్చిడి చేప మత్స్యకారుల వలకు చిక్కింది. మార్కెట్‌కు తీసుకెళితే కొనుగోలు చేసేందుకు వ్యాపారులు పోటీపడి భారీ ధరకు దక్కించుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మత్స్యకారులు చేపల వేటకు వెళ్లారు.. వారి వలకు రెండు కచ్చిడి చేపలు చిక్కాయి. వెంటనే వీటిని కోనసీమ జిల్లా అంతర్వేది మినీ ఫిషింగ్ హార్బర్‌కు తీసుకొచ్చి వేలంపాట నిర్వహించారు. రెండు చేపల్లో 35 కేజీల చేప రూ.1.20 లక్షలకు అమ్ముడుపోగా.. 30 కేజీల మరో చేప రూ.74 వేలు ధర పలికింది.మత్స్యకారులు తీసుకొచ్చిన ఈ రెండు చేపలు ఆడవని చెబుతున్నారు. అందుకే ధర తక్కువ వచ్చింది అంటున్నారు. అదే మగ చేపలు అయ్యుంటే ఏకంగా రూ.4 లక్షలకు పైగా ధర పలికేవి అంటున్నారు. ఈ కచ్చిడి చేపలోని కొన్ని బాగాలను మందుల తయారీకి, ఈ చేప గాల్‌ బ్లాడర్‌తో సర్జరీ చేసిన తర్వాత కుట్లు వేసే దారాన్ని తయారు చేస్తారని, అలాగే మాంసం తినడానికి, వైన్‌ తయారీలో వినియోగిస్తారని చెబుతున్నారు. ఈ కచ్చిడి చేపల శాస్త్రీ నామం ప్రొటోనిబియా డయాకాంథస్‌.. అలాగే గోల్డ్ ఫిష్ అని కూడా పిలుస్తుంటారు. ఇవి ఎక్కువగా హిందూ మహా సముద్రం, దక్షిణ పసిఫిక్‌ మహా సముద్రంలో, నదుల ముఖ ద్వారాల దగ్గర, అడుగున బురదగా, బండరాళ్లు ఉండే ప్రాంతాల్లో ఉంటాయి. ఈ చేపలు నదులు సముద్రంలో కలిసే చోట్ల మే నుంచి అక్టోబర్‌ మధ్య కాలంలో వచ్చి గుడ్లుపెడతాయని చెబుతుంటారు. ఈ కచ్చిడి చేపలు తింటే కంటి చూపును మెరుగుపరిచే చాలా విటమిన్స్ పుష్కలంగా లభిస్తాయంటారు. గతంలో కూడా కచ్చిడి చేపలు మత్స్యకారుల వలకు చిక్కాయి. మత్స్యకారులు ఈ చేపల్ని వేలం పాట ద్వారా విక్రయిస్తుంటారు. ఈ చేపల్ని ఇక్కడ కొనుగోలు చేసి పశ్చిమ బెంగాల్‌కు పంపిస్తుంటారు. ఈ చేపలకు విదేశాల్లో కూాడా మంచి గిరాకి ఉందంటారు. అందుకే వ్యాపారులు ఈ కచ్చిడి చేపలను వేలం పాటలో కొనుగోలు చేయడానికి పోటీపడుతుంటారు.