డిస్కంలకు సింగరేణి షాక్‌.. రాజస్థాన్‌కు కొత్త ప్లాంటు కరెంటు, తెలంగాణకు కష్టాలు తప్పవా..?

Wait 5 sec.

తెలంగాణ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ షాక్‌ ఇచ్చింది. రాష్ట్ర విద్యుత్ అవసరాల కోసం మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం పెగడపల్లిలో కొత్తగా నిర్మించ తలపెట్టిన 800 మెగావాట్ల థర్మల్ ప్లాంట్ విద్యుత్తును ఇప్పుడు రాజస్థాన్‌కు విక్రయించాలని సింగరేణి నిర్ణయించింది. దశాబ్దాలుగా తెలంగాణ గనుల నుంచి బొగ్గు తీస్తూ రాష్ట్ర పారిశ్రామిక, వ్యవసాయ రంగానికి వెన్నెముకగా నిలిచిన సింగరేణి.. ఇప్పుడు తన సొంత రాష్ట్ర డిస్కంలకు కాకుండా పొరుగు రాష్ట్రమైన రాజస్థాన్ విద్యుదుత్పత్తి సంస్థతో జాయింట్ వెంచర్ కంపెనీ ఏర్పాటుకు సిద్ధమవ్వడం చర్చనీయాంశంగా మారింది.ఈ నిర్ణయం వెనుక ప్రధానంగా ఆర్థిక కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు సింగరేణికి చెల్లించాల్సిన బకాయిలు కొండలా పేరుకుపోయాయి. ప్రస్తుతం ఉన్న 1200 మెగావాట్ల ప్లాంటు నుంచి సరఫరా అవుతున్న విద్యుత్తుకు సంబంధించి డిస్కంలు దాదాపు రూ. 27,379 కోట్ల మేర బకాయిలు పడ్డాయి. ఈ భారీ ఆర్థిక లోటు వల్ల సంస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉండటంతో కొత్త ప్లాంటు విద్యుత్తును నగదు చెల్లింపులు సక్రమంగా చేసే ఇతర రాష్ట్రాలకు, భావించినట్లు తెలిసింది. రాజస్థాన్‌కు థర్మల్ విద్యుత్ ఇచ్చి.. దానికి బదులుగా అక్కడ 1500 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసి, ఆ కరెంటును వినియోగించుకోవాలనే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉంది.అయితే, ఈ నిర్ణయం తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. రాష్ట్రానికి అదనపు థర్మల్ విద్యుత్ అవసరమని ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు ఇటీవలే రాష్ట్ర మంత్రివర్గం రామగుండంలో కొత్తగా 800 మెగావాట్ల థర్మల్ ప్లాంటు నిర్మాణానికి జెన్‌కోకు అనుమతి ఇచ్చింది. పెగడపల్లిలో ఇప్పటికే ఉన్న 1200 మెగావాట్ల ప్లాంటు పక్కనే కొత్త యూనిట్ నిర్మిస్తే భూసేకరణ భారం ఉండదు కాబట్టి మెగావాట్‌కు రూ. 12 కోట్ల ఖర్చుతోనే నిర్మాణం పూర్తవుతుంది. కానీ ఈ కరెంటును రాజస్థాన్‌కు అమ్మేసి భవిష్యత్తులో తెలంగాణ కోసం మరో చోట ప్లాంటు నిర్మించాలంటే మళ్లీ వేల ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంటుంది. దీనివల్ల రాష్ట్ర ఖజానాపై అదనంగా భారం పడటమే కాకుండా, ప్రాజెక్టు పూర్తి కావడానికి ఏళ్ల సమయం పడుతుంది.మరోవైపు, పర్యావరణ నిబంధనలు కఠినతరం అవుతున్న తరుణంలో బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలకు అనుమతులు రావడం కష్టతరమవుతోంది. చేతిలో ఉన్న అవకాశాన్ని వేరే రాష్ట్రానికి ధారాదత్తం చేస్తే.. భవిష్యత్తులో తెలంగాణ పారిశ్రామిక వృద్ధికి అవసరమైన చౌక విద్యుత్ లభ్యత తగ్గే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. సింగరేణి టెండర్ ప్రక్రియను వేగవంతం చేస్తూ కన్సల్టెన్సీ సంస్థల కోసం ప్రకటన జారీ చేయడంతో ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా కూడా దుమారం రేపుతోంది. రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం సమన్వయంతో బకాయిల సమస్యను పరిష్కరించుకుని ఈ 800 మెగావాట్ల విద్యుత్తును రాష్ట్ర అవసరాలకే వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.