పేద పిల్లలకు ఉచిత విద్య.. ఉగాది వేళ మెగాస్టార్ చిరంజీవి కీలక ప్రకటన

Wait 5 sec.

మెగాస్టార్ సేవాగుణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తన సేవా కార్యక్రమాల ద్వారా రీల్ హీరోనే కాదు రియల్ హీరో అనిపించుకుంటున్నారు. బ్లడ్‌ బ్యాంక్‌, ఐ బ్యాంక్‌, ఆక్సిజన్ బ్యాంక్.. ఇలా పలు కార్యక్రమాలతో తన మంచి మనసు చాటుకున్నారు. ఆపదలో ఉన్నవారికి ఆపద్బాంధవుడుగా నిలిచారు. అయితే ఇప్పుడు ఆయన మరో సరికొత్త సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఉగాది పండగ వేళ దీనిపై కీలక ప్రకటన చేశారు.తెలుగు కొత్తసంవత్సరాదిని పురస్కరించుకుని చిరంజీవి ఓ ఛానెల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ సందర్భంగా భవిష్యత్తులో పేద పిల్లలకు ఉచిత విద్య అందించడమే తన లక్ష్యమని తెలిపారు. తమిళ హీరో సూర్య తన సేవా కార్యక్రమాల స్ఫూర్తితో తన తండ్రి శివకుమార్ పేరుతో 'అగరం ఫౌండేషన్'ను స్థాపించి ఎందరో పేద విద్యార్థులను ఉన్నత చదువులు చదివిస్తున్నారని.. ఇప్పుడు సూర్య స్పూర్తితో తానూ విద్యాదానం చేయాలని నిర్ణయించుకున్నానని చిరు చెప్పారు.''ఫ్యూచర్ లో పేద పిల్లలకు ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఆలోచిస్తున్నాను. కుటుంబంలోని ఒక వ్యక్తి విద్యావంతుడైతే ఆ కుటుంబం మొత్తం బాగుపడుతుంది. నేను ఆ దిశగా ఆలోచిస్తున్నాను. చిరంజీవి స్ఫూర్తితోనే ‘అగరం ఫౌండేషన్‌’ స్థాపించి, ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్నానని యాక్టర్ సూర్య చెబుతుంటారు. నన్ను కలిసినప్పుడు ఎన్నో సందర్భాల్లో చెప్పారు. ఆయన చేసే ఎడ్యుకేషన్ సేవా కార్యక్రమాలు, విద్యాదానం నన్ను ఎంతగానో మోటివేట్ చేసింది. ఒకప్పుడు నేను నీకు ఇన్‌స్పిరేషన్‌.. ఇప్పుడు నువ్వు నాకు ఇన్‌స్పిరేషన్‌ అయ్యావ్ అని సూర్యతో అన్నాను. నేను ఆ నమూనా తెలుసుకొని, రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. దేశవ్యాప్తంగా ఎక్కడున్నా సరే అవసరం ఉన్న పేదవారందరికీ ఉచిత విద్య అందించాలని అనుకుంటున్నాను. నా భవిష్యత్ కార్యాచరణ పేదవారికి ఫ్రీ ఎడ్యుకేషన్ అందించడమే'' అని చిరంజీవి అన్నారు. ఇప్పటికే బ్లడ్‌ బ్యాంక్‌, ఐ బ్యాంక్‌, ఆక్సిజన్ బ్యాంక్ ద్వారా ఎందరో జీవితాలకు భరోసా కల్పించిన చిరంజీవి.. ఇప్పుడు పేదలకు ఉచిత విద్య అందించే కార్యక్రమం చేపట్టబోతున్నట్లు ప్రకటించడంతో ఆయనపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. సేవా కార్యక్రమాల్లోనూ ఆయన మెగాస్టార్ అని అభిమానులు కొనియాడుతున్నారు.