Flight Ticket: విమాన ప్రయాణికులకు అదిరే శుభవార్త. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విమాన టికెట్లపై అదనపు బాదుడు నుంచి ఉపశమనం కల్పిస్తూ కేంద్ర పౌర విమానయాన శాఖ శుభవార్త చెప్పింది. విమానాల్లో సీట్ల ఎంపిక కోసం విధిస్తున్న అధిక ఛార్జీలను అరికట్టేందుకు చర్యలు చేపట్టింది. ఇక నుంచి అన్ని విమానాల్లో కనీసం 60 శాతం సీట్లు ఎలాంటి ఇకపై ఒక్క రూపాయి అదనంగా చెల్లించకుండా తమకు నచ్చిన సీటును ఎంచుకోవచ్చు. ఈ మేరకు బుధవారం రోజున పౌర విమానయాన శాఖ ఓ ప్రకటన జారీ చేసింది. మరి ఆ వివరాలు తెలుసుకుందాం. విమానాల్లోని సీట్లను ఎంచుకునేందుకు అదనపు ఛార్జీలు విధిస్తున్నారు. ఇలాంటి ఛార్జీలతో ఎయిర్ లైన్స్ దోపిడీకి పాల్పడుతున్నాయంటూ కొంత కాలంగా ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రానికి ఫిర్యాదులు చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఈ విషయంపై మాట్లాడుతున్నారు. ప్రస్తుతం విమానాల్లోని సీట్ల ధరలను అవి ఉన్న స్థానాలకు అనుగుణంగా నిర్ణయిస్తున్నారు. దీంతో ఒక్కో సీటు ధర ఒక్కోలాగా ఉంటుంది. ఉదాహరణకు మీరు విండో సీటు ఎంచుకుంటే ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. అలాగే దారి పక్కన ఉండే సీట్లకు కాస్త ఎక్కువ సౌకర్యంగా ఉంటుందనే కారణంతో ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. కానీ, విమానాల్లో చాలా తక్కువ సీట్లకు మాత్రమే ఏ ఛార్జీలు లేకుండా అందుబాటులో ఉంచుతున్నారు. అవి కూడా మధ్య వరుసలో లేదా విమాన చివర్లో ఉంటున్నాయి. ఈ తరహా అదనపు ఛార్జీలు ఎందుకంటూ ప్రయాణికులు తరుచూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రయాణికుల నుంచి పెరుగుతున్న ఫిర్యాదుల నేపథ్యంలోనే పౌర విమానయాన శాఖ తాజా చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. అన్ని విమానాల్లో కనీసం 60 శాతం సీట్లను అదనపు ఛార్జీలు లేకుండా అందుబాటులోకి తీసుకురావాలి. ఒకే పీఎన్ఆర్ నంబర్ తో టికెట్లు బుకింగ్ చేసుకునే ప్రయాణికులు ఒకే దగ్గర కూర్చునేలా సీట్లను కేటాయించాల్సి ఉంటుంది. ప్రయాణికుల క్రీడా పరికరాలు, సంగీత వాయిద్యాలను భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా సురక్షితంగా ఉంచాలి. ఇక పెంపు జంతువుల కోసం స్పష్టమైన పాలసీలను తీసుకురావాలి. విమానాల ఆలస్యం, రద్దు వంటిన సందర్భాల్లో ప్రయాణికుల హక్కుల విధివిధానాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. వెబ్‌సైట్లు, యాప్స్, బుకింగ్ ప్లాట్ ఫారాలు, ఎయిర్ పోర్ట్ కౌంటర్ల వద్ద ప్రదర్శించాలి. ప్రాంతీయ భాషల్లోనూ సమాచారం ఇవ్వాలి.