Jio నుంచి కొత్త సేవలు.. ఇక UPI క్యాష్ విత్‌డ్రా.. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే సరిపోతుంది

Wait 5 sec.

Jio UPI Cash Withdrawal: రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన అనుబంధ సంస్థ మరో కొత్త తరహా సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. తమ బిజినెస్ కరస్పాండెంట్ టచ్ పాయింట్ల ద్వారా ఇది దేశీయ డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, ఫైనాన్షియన్‌ ఇన్‌క్లూజన్‌ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఉపయోగపడుతుందని జియో పేమెంట్స్ బ్యాంక్ తెలిపింది. ముఖ్యంగా గ్రామీణ, టూ-టైర్ నగర ప్రాంతాల్లోని వినియోగదారులు తమ యూపీఐ యాప్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి క్యాష్ విత్ డ్రా చేసుకోవచ్చని తెలిపింది. ఇందుకోసం ఎలాంటి డిబెట్ కార్డులు, ఏటీఎం అవసరం ఉండదని జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఓ ప్రకటనలో పేర్కొంది. బిజినెస్ కారస్పాండెంట్ టచ్ పాయింట్ వద్ద కార్డ్ రహిత క్యాష్ విత్ డ్రాయల్‌కు అవకాశం కల్పించడం ద్వారా డిజిటల్ పేమెంట్లకు, భౌతిక నగదు లభ్యతకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గిస్తుందని జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ తెలిపింది. తొలిసారిగా డిజిటల్ యూజర్లకు సురక్షితమైన యూపీఐ ట్రాన్సాక్షన్లు చేసేందుకు ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయని తెలిపింది. ఈ కొత్త సేవల ద్వారా జియో పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (JPBL) దేశీయ డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థను బలోపేతం చేయడంతో తన పాత్రను మరింత ముందుకు తీసుకెళ్తుందని పేర్కొంది. తమ బిజినెస్ కరస్పాండెంట్ టచ్ పాయింట్ నెట్‌వెర్క్‌ను మారు మూల గ్రామాలకు సైతం విస్తరించి ప్రజలకు సులభంగా బ్యాంకింగ్ సేవలు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం అత్యధికంగా నగదుపై ఆధారపడుతున్న సెగ్మెంట్లలోకి యూపీఐని తీసుకెళ్లేందుకు ఇది సహాయపడుతుందని పేర్కొంది. గ్రామీణ, సెమీ అర్బణ్ ఇండియాలో ఆర్థిక వ్యవస్థలోకి మరింత మందిని తీసుకొస్తుందని తెలిపింది. దేశవ్యాప్తంగా వ్యక్తిగత, వ్యాపార ఆర్థిక అవసరాలకు అనుగుణంగా డిజిటల్ బ్యాంకింగ్ సర్వీసులు అందిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ, సెమీ అర్బణ్ ప్రాంతాల్లోని కస్టమర్లకు డిజిటల్ సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంగా పని చేస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు యూపీఐ ఆధారిత నగదు విత్ డ్రా సేవలను తీసుకొచ్చినట్లు జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ వర్గాలు పేర్కొన్నాయి. డిజిటల్ పేమెంట్లకు ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్న వారికి, ఏటీఎం డెబిట్ కార్డులు లేని వారికి నగదు అందుబాటులోకి తీసుకురావడమే దీని ఉద్దేశంగా తెలిపారు.