ఒకప్పుడు ఏం కావాలన్నా సరే బయటకు వెళ్లి తెచ్చుకునేవాళ్లం.. ఇప్పుడు ఆ పరిస్థితులు మారాయి. ఏం కావాలన్నా సరే ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తే నిమిషాల్లో ఇంటికే డోర్ డెలివరీ చేస్తున్నారు. యూప్‌ల ద్వారా ప్రజలకు ఎన్నో రకాల సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఏపీ ప్రభుత్వం మాత్రం విభిన్నంగా ప్రజలకు రైతు బజార్ల నుంచి కూరగాయలు, పండ్లను డోర్ డెలివరీ చేస్తోంది. ఈ మేరకు విశాఖపట్నంలో ముందుగా పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రారంభించారు. అక్కడ సక్సెస్ కావడంతో గుంటూరు, కాకినాడ జిల్లాల్లో శ్రీకారం చుట్టారు. తాజాగా విజయవాడలో కూడా డిజి రైతుబజార్‌ యాప్‌ను తీసుకొచ్చారు. అక్కడ కూడా ప్రస్తుతం కార్యకలాపాలు ప్రారంభించిన అధికారులు అందరికీ డీజీ రైతుబజార్‌ యాప్ వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు.రైతు బజార్లలో కూరగాయలు తక్కువ ధరకే ప్రజలకు అందుబాటులో ఉంటున్నాయి. డిజి రైతు బజార్ల ద్వారా ఏపీ మార్కెటింగ్ శాఖతోపాటు మాచింట్ సంస్థ సంయుక్తంగా ఈ సేవలను అందిస్తున్నాయి. రైతు బజార్ల నుంచి కూరగాయలు, పండ్లు ఆర్డర్ చేసుకోవాలంటే గూగుల్ ప్లే స్టోర్ నుంచి డిజిఆర్బీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇంటి అడ్రస్, మొబైల్ నంబర్ వివరాలు ఎంట్ చేసి.. ఆ తర్వాత దగ్గర్లో ఉన్న రైతుబజార్‌కు ఆర్డర్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత నేరుగా కూరగాయలు ఇంటికే డోర్ డెలివరీ చేస్తారు. కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, కొన్ని నిత్యావసర వస్తువుల్ని ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారు. అయితే ప్రజలు కనీసం వంద రూపాయలలోపు ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే డిజి రైతు బజార్లు హ్యాడ్లింగ్ ఛార్జీలు, జీఎస్టీ కలిపి రూ. 49 వరకు ఛార్జీలు వసూలు చేస్తారు. మార్కెటింగ్ విస్తరణ జరుగుతోంది.. అలాగే ప్రజలకు సులభతరంగా సేవలు అందించడానికి వీలవుతోంది. ప్రస్తుతం కొన్ని నగరాల్లో ఈ ఆన్‌లైన్ రైతుబజార్లు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత చిన్నచిన్న సమస్యలపై అధ్యయనం చేసి అన్ని చోట్లా డిజి రైతుబజార్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. ఈ డిజి రైతు బజార్ల ద్వారా.. రైతు బజార్లకు రాలేనివారికి, ఉద్యోగులు, మహిళలకు ఎంతో సౌకర్యంగా ఉంది. రైతు బజార్లలో ఉండే రేటుకే ఇంటికే కూరగాయలు, ఇతర వస్తువులు డోర్ డెలివరీ చేస్తున్నారు. కేవలం సర్వీస్ ఛార్జీలు మాత్రమే వసూలు చేస్తున్నారు. ఈ మంచి అవకాశాన్ని రైతులు, వినియోగదారులు వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ ఎండాకాలంలో రైతు బజార్లకు రాలేని వారికి కూడా ఉపయోగంగా ఉంటుంది అంటున్నారు. ప్రజలకు సమయం వృథా కాకుండా ఈ డిజి రైతు బజార్ల సేవలు ఉపయోగపడతాయి అంటున్నారు.