ఏపీలో ప్రభుత్వ టీచర్లకు కొత్త బాధ్యతలు.. కీలక ఆదేశాలు జారీ

Wait 5 sec.

ఏపీలో టీచర్లకు కొత్త బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. ఇకపై రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పెట్టే మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంలో రాజీ పడకుండా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై కచ్చితంగా స్కూల్‌లో టీచర్‌ రుచి చూశాకే పిల్లలకు భోజనం వడ్డించాలని మధ్యాహ్న భోజన విభాగం డైరెక్టర్‌ బి శ్రీనివాసరావు ఆదేశించారు. మంత్రి లోకేష్ స్వయంగా ఎన్టీఆర్‌ జిల్లా మైలవరం తారకరామానగర్‌లోని మండల పరిషత్‌ ఆదర్శ ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. భోజనం బాగుందని చెప్పారు.. అయినా సరే నాణ్యతలో ఎక్కడా రాజీ పడకూడదన్నారు. ఇకపై రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో భోజనం రుచి చూడటానికి హెడ్‌మాస్టర్ రోజుకొక టీచర్‌ను కేటాయించాలని ఆదేశించారు. ఆ ఉపాధ్యాయుడు పిల్లలకు పెట్టకముందే ఆ భోజనాన్ని రుచి చూడాల్సి ఉంటుంది. భోజనం ఎలా ఉంది.. మెనూలోని ఆహార పదర్థాల నాణ్యతను పరిశీలించాల్సి ఉంటుంది. ఫీడ్‌ బ్యాక్‌‌ను లీప్‌ యాప్‌లో నమోదు చేయాలి. అంతేకాదు మధ్యాహ్న భోజనంపై టీచర్లతో పాటుగా తల్లిదండ్రుల నుంచి కూడా ఫీడ్‌బ్యాక్‌ తీసుకుంటారు. లీప్‌ యాప్‌ ద్వారా తల్లిదండ్రులు ఫీడ్‌బ్యాంక్ ఇవ్వొచ్చు. టీచర్లు, తల్లిదండ్రుల అభిప్రాయాల ఆధారంగా మధ్యాహ్న భోజనంపై అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటారు. మంత్రి లోకేష్ కూడా కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి స్కూల్‌లో రోజూ భోజనం నాణ్యతను పరిశీలించాలని ఉపాధ్యాయుల్ని ఆదేశించారు. టీచర్లు పరిశీలన చేశారా లేదో అనేది ఎంఈవో చూడాలని, డీఈవోలు కూడా పర్యవేక్షించాలని సూచించారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం తారకరామా నగర్ మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం బాగాలేదనే ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో పాఠశాలను తనిఖీ చేశాను. విద్యార్థులకు వడ్డిస్తున్న భోజనాన్ని తిని నాణ్యతను పరిశీలించారు లోకేష్. కొత్త కాంట్రాక్టర్ అందిస్తున్న భోజనం నాణ్యతపై విద్యార్థులను ఆరా తీయగా.. వారు భోజనం బాగుందని చెప్పారు. మంత్రి లోకేష్ కూడా భోజనం రుచి చూశారు. మరోసారి తప్పు పునరావృతం అయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మధ్యాహ్న భోజనంపై విద్యార్థుల తల్లిదండ్రులతో ఐవీఆర్‌ఎస్‌ నిర్వహించి వారి సూచనలు తీసుకోవాలని ఆదేశించారు మంత్రి లోకేష్.