పశ్చిమాసియాలో యుద్ధం మరింత తీవ్రతరమవుతోంది. తన పొరుగు దేశాలకు చెందిన ఇంధన మౌలిక సౌకర్యాలపై ఇరాన్ లక్ష్యంగా చేసుకుని భీకర దాడులకు దిగుతోంది. తమ దక్షిణ ఫార్స్ దీవిపై ఇజ్రాయెల్ దాడితో రగిలిపోయిన ఇరాన్.. గల్ఫ్ దేశాల్లోని చమురు, గ్యాస్ మౌలిక సదుపాయాలపై గురువారం ఉదయం విరుచుకుపడింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సౌదీ.. తమ సహనాన్ని పరీక్షించవద్దని మండిపడింది. విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైజల్ బిన్ ఫర్హాన్ అల్ సౌద్ స్పందిస్తూ.. తమ దేశం, ఇతర గల్ఫ్ దేశాల సహనాన్ని చేతగానితనంగా భావించవద్దని, ఇవి బ్లాక్‌మెయిల్ ప్రయత్నాలని ఇరాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సౌదీ అరేబియా, ఇతర పొరుగు దేశాలు తమ వద్ద ఉన్న సామర్థ్యాలు, నైపుణ్యాలను ఉపయోగించుకోవచ్చని.. ఇరాన్ తన వ్యూహాన్ని తక్షణమే పునఃసమీక్షించుకోవాలని పిలుపునిచ్చారు. ఇది ఇలాగే కొనసాగితే తాము యుద్ధంలోకి అడుగుపెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. సౌదీ రాజధానిలో ప్రాంతీయ, ఇస్లామిక్ విదేశాంగ మంత్రులు సమావేశానికి ముందు రియాద్ వైపు ప్రయోగించిన నాలుగు బాలిస్టిక్ క్షిపణులను తాము అడ్డుకుని, ధ్వంసం చేశామని సౌదీ అరేబియా గురువారం ప్రకటించిది. ‘‘ఈ సమావేశానికి హాజరైన వారిని భయపెట్టేందుకు, ఇరాన్ ఆగదని సందేశం పంపేందుకు, ఈ దాడిని ఉద్దేశపూర్వకంగానే చేశారని నాకు స్పష్టంగా అర్థమైంది’’ అని అల్ సౌద్ అన్నారు.తన పొరుగు దేశాలపై ఇరాన్ ప్రత్యక్షంగా, పలు ప్రాక్సీల ద్వారా ఉద్దేశపూర్వక శత్రు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఈ చర్యలను అరికట్టాలని ఆయన టెహ్రాన్‌ను కోరారు. ‘ఇరాన్ ఈ విధంగా వ్యవహరిస్తున్నప్పుడు.. అది ఒక చట్టబద్ధమైన భాగస్వామి కాగలదని మేము ఏమాత్రం విశ్వసించలేం’ అన్నారు. ఇరాన్ దాడులకు గల్ఫ్ దేశాలు ఏమాత్రం భయపడబోమని సౌద్ నొక్కి చెప్పారు. ‘ఇప్పటివరకు ఉన్న చిన్న నమ్మకం కూడా పూర్తిగా పోయింది’ అని ఆయన వ్యాఖ్యానించారు.