'డాడీ, మోడీ. చిన్న మోడీపైనే నా పోరాటం'.. కొత్త పార్టీపై కవిత కీలక వ్యాఖ్యలు

Wait 5 sec.

బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చి గత కొన్ని రోజులుగా రాష్ట్రంలోని ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు .. కొత్త పార్టీ పెట్టనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. కొత్త పార్టీ ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే చర్యలు ప్రారంభించానని.. రెండు నెలల్లో కొత్త పార్టీ ఏర్పాటు పూర్తి కానున్నట్లు ఇప్పటికే పలుమార్లు మీడియాకు కవిత వెల్లడించారు. ఈ క్రమంలోనే కవిత కొత్త పార్టీకి సంబంధించి ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. మరోవైపు.. తాను స్థాపించనున్న కొత్త రాజకీయ పార్టీకి కల్వకుంట్ల కవిత తెలంగాణ ప్రజా జాగృతి అనే పేరును పెట్టారు. ఇదే పేరు మీద కేంద్ర ఎన్నికల సంఘానికి ఆమె దరఖాస్తు చేశారు. తన పార్టీ నమోదును వేగంగా పూర్తి చేయాలని కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. ఆమె దాఖలు చేసిన దరఖాస్తులో లోపాలు ఉన్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఈ క్రమంలోనే తన కొత్త పార్టీకి సంబంధించిన అజెండా ఏంటి అనేదానిపై కసరత్తు జరుగుతున్నట్లు కవిత వెల్లడించారు. పార్టీ స్థాపించినపుడే తమ అజెండా, లక్ష్యాలను ప్రకటిస్తానని తేల్చి చెప్పారు. డాడీ, మోడీ, చిన్న మోడీలపైనే తన, తన పార్టీ పోరాటం ఉంటుందని స్పష్టం చేశారు. సామాజిక తెలంగాణే తమ ధ్యేయమని.. సర్వోదయ తెలంగాణ దిశగా తమ పార్టీ ముందుకు వెళ్తుందని వెల్లడించారు. జాతిపిత మహాత్మా గాంధీ సర్వోదయ సిద్ధాంతాన్ని తాము లోతుగా అధ్యయనం చేస్తున్నామని కల్వకుంట్ల కవిత వివరించారు.ఒక సరైన ముహూర్తం వేళ పార్టీకి సంబంధించిన కీలక వివరాలను అధికారికంగా విడుదల చేయనున్నట్లు కవిత వెల్లడించారు. పార్టీ ఆఫీస్‌ను ఎక్కడ ఏర్పాటు చేయాలి అనే దానిపై స్థలాన్ని కూడా వెతుకుతున్నట్లు తెలిపారు. తాము ఎవరితో రాజీ పడేది లేదని.. తాను పెట్టబోయే కొత్త పార్టీ కచ్చితంగా విజయవంతం అవుతుందని కవిత ధీమా వ్యక్తం చేశారు. శ్రీరామనవమి తర్వాత తన కొత్త పార్టీకి సంబంధించిన ప్రకటన ఉంటుందని పేర్కొన్న కవిత.. అంతకుముందే జాతీయ స్థాయి నేతలను కొందరిని కలవనున్నట్లు చెప్పారు. తనకు ఎంతోమంది జాతీయ స్థాయి నాయకులతో సంబంధాలు ఉన్నాయని.. వారి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తానని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేందుకు చేపట్టిన ఉద్యమంలో పోరాటం చేసిన యువతకు తమ పార్టీలో అవకాశం కల్పిస్తానని ప్రకటించారు.