: అంతర్జాతీయంగా కొంత కాలంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇరాన్- ఇజ్రాయెల్- అమెరికా మధ్య యుద్ధంతో స్టాక్ మార్కెట్లు కూడా దారుణంగా పతనం అవుతున్నాయి. యుద్ధం నేపథ్యంలో హార్ముజ్ జలసంధి దగ్గర చమురు నౌకల్ని ఇరాన్ అడ్డుకుంటుండటంతో చమురు సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 100 డాలర్ల మార్కు దాటేసింది. ఇంకా రూపాయి విలువ కూడా భారీగా తగ్గుతుండటంతో ద్రవ్యోల్భణం భయాలు పెరిగాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే విదేశీ మదుపరులు కూడా పెద్ద మొత్తంలో తమ పెట్టుబడుల్ని వెనక్కి తీసుకుంటుండటంతో సూచీలపై ఒత్తిడి పడింది. దీంతో వరుస సెషన్లలో పతనం అవుతూనే ఉన్నాయి. ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభం కాగా.. అక్కడి నుంచి సూచీలు కుదేలవుతూనే ఉన్నాయి. స్టాక్ మార్కెట్లకు మార్చి నెల అత్యంత వరెస్ట్ అని చెప్పొచ్చు. ఈ క్రమంలో సెన్సెక్స్ 6000 పాయింట్లకుపైగా పడిపోగా.. ఇన్వెస్టర్ల సంపద రూ. 33 లక్షల కోట్లకు మించి తగ్గింది. ఇక కిందటి వారం చూస్తే బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 4,355 పాయింట్లు తగ్గగా ఇది దాదాపు 5.51 శాతానికి సమానం. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 1299.35 పాయింట్లు లేదా 5.31 శాతం పతనమైంది. ఈ క్రమంలోనే మార్కెట్ విలువ పరంగా టాప్- 10 కంపెనీల వాల్యుయేషన్ రూ. 4.48 లక్షల కోట్లు తగ్గింది. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువనే మదుపరుల సంపదగా పరిగణిస్తుంటారన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇన్వెస్టర్లకు ఈ మేర నష్టం వాటిల్లిందని చెప్పొచ్చు. అత్యధికంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మార్కెట్ విలువ కిందటి వారం రూ. 89 వేల కోట్లకుపైగా తగ్గడంతో రూ. 9.66 లక్షల కోట్లకు దిగొచ్చింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 61 వేల కోట్లకుపైగా తగ్గి రూ. 12.57 లక్షల కోట్లకు చేరుకుంది. బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ విలువ రూ. 59 వేల కోట్లు తగ్గి రూ. 5.32 లక్షల కోట్లకు చేరుకుంది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) విలువ రూ. 53 వేల కోట్లు తగ్గడంతో రూ. 8.72 లక్షల కోట్లుగా ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 42 వేల కోట్లకుపైగా తగ్గడంతో 8.97 లక్షల కోట్లుగా ఉంది. భారతీ ఎయిర్‌టెల్ విలువ గత వారం రూ. 38 వేల కోట్లు తగ్గి రూ. 10.28 లక్షల కోట్లుగా ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ విలువ రూ. 33 వేల కోట్లు తగ్గి రూ. 18.68 లక్షల కోట్లుగా ఉంది. ఎల్ఐసీ విలువ రూ. 31 వేల కోట్లు తగ్గడంతో రూ. 4.88 లక్షల కోట్లకు పడిపోయింది. ఇన్ఫోసిస్ విలువ కిందటి వారం రూ. 24 వేల కోట్లు తగ్గడంతో రూ. 5.06 లక్షల కోట్లుగా ఉంది. ఇక హిందుస్థాన్ యూనిలివర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 15 వేల కోట్లకుపైగా పతనంతో రూ. 5.07 లక్షల కోట్లుగా ఉంది.