తెలంగాణలోని నిరుపేదలకు రేవంత్ సర్కార్ తీపి కబురు చెప్పింది. అమలు చేయాలని డిసైడ్ అయింది. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పూరి గుడిసెలు, టార్పాలిన్‌లతో ఏర్పాటు చేసుకున్న ఇళ్ల సర్వేను సర్కార్ చేపట్టింది. హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో మార్చి నాలుగో వారంలో గ్రామాల వారీగా సర్వే నిర్వహించి.. ఆ నివేదికను తయారు చేయనుంది. ఈ నివేదికలో గుర్తించిన పేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనుంది. ప్రస్తుతం మంజూరైన ఇందిరమ్మ లబ్ధిదారుల్లో ఎవరైనా ఇల్లు కట్టుకోవడానికి ఆసక్తి చూపకపోతే ఆయా లబ్దిదారుల అనుమతితో సర్వేలో గుర్తించిన పేదలకు ఆ ఇళ్లను ఇవ్వాలని నిర్ణయించింది. ఈ సర్వేలో పూరి గుడిసెలు ఉండి ఇందిరమ్మ పథకంలో ఇళ్లు మంజూరైన లబ్ధిదారులను కూడా గుర్తిస్తారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ప్రభుత్వం 3,24,593 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది. వాటిలో 2,63,058 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. కొందరు ఇప్పటికే గృహ ప్రవేశాలు కూడా చేశారు. తెలంగాణను గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ప్రభుత్వ లక్ష్యంతో ఈ సర్వే కొనసాగనుంది. తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న 99 రోజుల ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇక పేదలకు తక్కువ ధరకే నిర్మాణ సామగ్రిని అందించడానికి ఉమ్మడి ఏపీలో ఏర్పాటు చేసిన నిర్మితి కేంద్రాలను పునరుద్ధరించాలని తాజాగా రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని మహిళా సంఘాలకు లీజుకు ఇవ్వాలని డిసైడ్ అయింది. ఇందిరమ్మ ఇంటికి అవసరమైన సిమెంట్, ఇటుక, ఉక్కు వంటి సామగ్రిని కూడా తక్కువ ధరకు అందేలా ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో అవసరమైన చోట ఇసుక బజార్లను ప్రారంభిస్తారు. మన ఇసుక వాహనం ద్వారా లబ్ధిదారులకు ఇసుకను అందించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ప్రభుత్వం పేదల ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం చేస్తున్న సంగతి తెలిసిందే. మెుత్తం 4 విడతల్లో ఈ డబ్బులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షలకు పైగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు జరుగుతుండగా.. బిల్లులను ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నారు. ఏఫ్రిల్‌లో రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని సర్కార్ ఇప్పటికే ప్రకటించింది.