: భారత స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం సెషన్‌లో తీవ్ర ఒడుదొడుకుల్లో కొనసాగుతున్నాయి. లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. ఆరంభంలో 300 పాయింట్లకుపైగా పెరిగినా.. మళ్లీ ఒక్కసారిగా వెనక్కి వెళ్లి అదే స్థాయిలో నష్టాల్ని నమోదు చేశాయి. తర్వాత మళ్లీ లాభాల్లోకి మళ్లాయి. ఇలా సెషన్ ఆరంభం నుంచి లాభనష్టాల మధే కదలాడుతున్నాయి. ప్రస్తుతం వార్త రాస్తున్న సమయంలో మార్చి 17 మధ్యాహ్నం 12.30 గంటలకు బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 20 పాయింట్ల నష్టంతో 75,480 స్థాయిలో ఉంది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 5 పాయింట్ల నష్టంతో 23,400 స్థాయిలో ఉంది. అయితే మార్కెట్లు నష్టాల్లో కదలాడుతున్న సమయంలోనే ప్రముఖ బ్యాంక్ ఐడీబీఐ లిమిటెడ్ షేరు ధర భారీగా పతనం అవుతోంది. కిందటి రోజు రూ. 76.90 వద్ద ముగిసిన స్టాక్ ధర ఇవాళ మార్చి 17న దాదాపు 3 శాతం నష్టంతో ఇంట్రాడేలో రూ. 74.61 వద్ద సెషన్ కనిష్ఠాన్ని తాకింది. ఇప్పుడు రూ. 74.78 వద్ద ట్రేడవుతోంది. ఈ స్టాక్ కిందటి రోజు మార్చి 16న చూస్తే ఏకంగా 18 శాతం వరకు కుదేలవడం గమనార్హం. చివరకు 17 శాతానికిపైగా నష్టంతో రూ. 76.90 వద్ద స్థిరపడింది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ. 118.38 కాగా.. కనిష్ఠ ధర రూ. 72 గా ఉంది. మార్కెట్ విలువ చూస్తే రూ. 80.43 వేల కోట్లుగా ఉంది. ఈ స్టాక్ ఒక్కసారిగా ఇంతలా పతనం అయ్యేందుకు ప్రధాన కారణం.. కేంద్రం తీసుకున్న కీలక నిర్ణయం అని తెలుస్తోంది. ఈ బ్యాంకులో ప్రతిపాదిత వాటాల విక్రయ ప్రక్రియను కేంద్రం నిలిపివేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎప్పటినుంచో .. దానికి ఆటంకం ఏర్పడినట్లు సమాచారం. ఇక్కడ ఐడీబీఐలో వాటా కొనుగోలుకు ముందుకొచ్చిన కొనుగోలుదారులు.. ప్రభుత్వం నిర్దేశించిన రిజర్వ్ ధర కంటే తక్కువ ధరకే కోట్ చేసినట్లు తెలిసింది. దీంతో ఈ విక్రయ ప్రక్రియను ప్రస్తుతానికి నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పలు మీడియాల్లో వార్తలు వచ్చాయి. ఐడీబీఐ బ్యాంకులో కేంద్ర ప్రభుత్వం, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) రెండింటికీ కలిపి 90 శాతం వరకు వాటా ఉంది. దీంట్లో నుంచి ఎల్ఐసీ 30.24 శాతం, ప్రభుత్వం 30.38 శాతం చొప్పున మొత్తం 60 శాతానికిపైగా వాటాను విక్రయించేందుకు ఈ ప్రక్రియ 2022లోనే ప్రారంభమైంది. కానీ ఇప్పుడు ఇలా జరగడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది. దీంతో అమ్మకాలు వెల్లువెత్తుతున్నాయని తెలుస్తోంది. ఈ బ్యాంక్ షేర్ పతనం అవుతుండగా.. ఇన్వెస్టర్లకు నష్టాలు వస్తున్నాయి.