Defence Stocks: భారతీయ స్టాక్ మార్కెట్లో గత నాలుగు రోజులుగా వరుస నష్టాల్లో ముగిసిన రక్షణ రంగ షేర్లు ఒక్కసారిగా పుంజుకున్నాయి. అంతర్జాతీయంగా, ముఖ్యంగా పొరుగు దేశాలైన సరిహద్దుల్లో పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడుల క్రమంలో డిఫెన్స్ స్టాక్స్‌కు భారీ డిమాండ్ నెలకొంది. వరుస నష్టాలకు ముగింపు పలుకుతూ, మంగళవారం మార్చి 17వ తేదీ నాటి ట్రేడింగ్‌లో ప్రధాన డిఫెన్స్ సెక్టార్ కంపెనీల షేర్లు 7.5 శాతం వరకు లాభపడి ఇన్వెస్టర్లలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. మరి ఏ స్టాక్స్ లాభపడ్డాయి? అనే వివరాలు ఈ కథనం ద్వారా తెలుసుకుందాం. గత వారం రోజులుగా ప్రాఫిట్ బుకింగ్ కారణంగా రక్షణ రంగంలోని ప్రముఖ కంపెనీల స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి. అయితే, పాకిస్థాన్- అఫ్గానిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడం, అఫాన్‌లో పాక్ ఎయిర్ స్ట్రైక్స్ చేసిన వేళ దేశీయ డిఫెన్స్ స్టాక్స్ పుంజుకోవడం గమనార్హం. మంగళవారం ట్రేడింగ్‌లో మధ్యాహ్నం సమయానికి ఎంటీఏఆర్ టెక్నాలజీస్ (MTAR Technologies) షేరు గరిష్ఠంగా 7.5 శాతం మేర లాభపడింది. ఇక భారత్ ఫోర్జ్ షేరు 4 శాతం వరకు వృద్ధి కనబరిచింది. వీటితో పాటు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL), భారత్ ఎలక్ట్రానిక్స్, డేటా ప్యాటర్న్స్ వంటి కంపెనీలు సైతం లాభాల్లోకి వచ్చాయి. సియెంట్ డీఎల్ఎం, ఎంటీఏఆర్ టెక్ షేర్లు రాణించడంతో నిఫ్టీ ఇండియా డిఫెన్స్ లాభాల బాటపట్టింది. ఈ కంపెనీలు వరుసగా 7.8 శాతం, 5.6 శాతం మేర లాభాల్లో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ ఇండియా డిఫెన్స్ ఇండెక్స్ 0.5 శాతం మేర పెరిగి 7,901 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. పాక్- అఫ్గాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తత వైమానిక దాడులు చేపట్టింది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. సుమారు 400 మంది చనిపోయినట్లు అఫ్గానిస్థాన్ ప్రకటన చేసింది. సాధారణంగా ఇలాంటి భౌగోళిక రాజకీయ అనిశ్చితులు ఏర్పడినప్పుడు ప్రపంచవ్యాప్తంగా రక్షణ రంగ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుందనే అంచనాతో ఆ రంగం షేర్లు లాభపడతాయి. భారత మార్కెట్లోనూ ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. అలాగే అంతర్జాతీయ పరిణామాలతో పాటు భారత ప్రభుత్వం రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్‌కు ప్రాధాన్యత ఇవ్వడం ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంచుతోంది. డిఫెన్స్ కంపెనీల వద్ద ప్రస్తుతం రికార్డ్ స్థాయి ఆర్డర్లు ఉన్నాయి. భారత్ తన రక్షణ ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతి చేయడంపై దృష్టి సారించింది. దీంతో ఆయా కంపెనీల ఆదాయ మార్గాలను పెంచుతోంది. రక్షణ రంగ బడ్జెట్‌లోనూ భారీగా కేటాయింపులు చేసింది. ఇలాంటి పాజిటివ్ సంకేతాలు ఉన్న క్రమంలో డిఫెన్స్ స్టాక్స్ రాణిస్తున్నాయి. నాలుగు రోజుల వరుస పతనం తర్వాత రక్షణ రంగ షేర్లు కోలుకోవడం ఇన్వెస్టర్లకు ఊరటనిచ్చే అంశం.